ఏపీ భవన్ వద్ద హైఅలర్ట్!
భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అంశం తుది అంకానికి చేరుతున్న నేపథ్యంలో విభజన అనుకూల, ప్రతికూల వాదులతో ఇక్కడి ఏపీ భవన్ కిక్కిరిసిపోతోంది. ఇప్పటికే వేలసంఖ్యలో తెలంగాణ జేఏసీ, సీమాంధ్ర జేఏసీ నేతలు ఇక్కడే తిష్టవేసి తమకు తోచిన రీతిలో నిరసనలు తెలుపుతుండగా, సోమవారం ఉదయానికి ఇరు ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా ఢిల్లీకి చేరుకోనున్నారు. మరోపక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఏపీఎన్జీవోలు వేర్వేరుగా నిర్వహిస్తున్న ధర్నాకు సైతం వేలసంఖ్యలో సమైక్యవాదులు హాజరుకానుండటంతో ఏపీ భవన్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.
రాష్ట్ర పోలీసులతోపాటు ఢిల్లీ పోలీసులను భారీగా ఏపీ భవన్ చుట్టూ మోహరింపజేశారు. గడిచిన ఐదు రోజులుగా ఏపీ భవన్లో వరుసగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణపై దాడి జరిగిన దృష్ట్యా మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. తిలక్మార్గ్ డీసీపీ త్యాగీ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలు, సుమారు 100 మంది కానిస్టేబుళ్లతో ఏపీ భవన్ వద్ద భద్రత ఏర్పాటు చేశారు. ఏపీ భవన్ లోపలా, బయటా పెద్దసంఖ్యలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఏపీ భవన్ వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు.