Search Committees
-
మార్చి రెండో వారంలో నియామకాలు!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వైస్చాన్స్లర్ల నియామకాలు త్వరలోనే జరగనున్నాయి. వీసీల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులను ఆదేశించడంతో వీసీల నియామకంపై కదలిక మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు. అయితే 10 యూనివర్సిటీలకు ఇన్చార్జి వీసీలు ఉండగా, జేఎన్ఏఎఫ్ఏయూకు ఇన్చార్జి వీసీని కూడా నియమించలేదు. గతేడాది జూన్ 23 నాటికి జేఎన్ఏఎఫ్ఏయూ, బాసర ఆర్జీయూకేటీకి వీసీలు ఉన్నందున, అప్పట్లో జారీ చేసిన వీసీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లో వాటిని పేర్కొనలేదు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ, తెలుగు యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ వీసీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆయా పోస్టులకు 273 మంది ప్రొఫెసర్లు, 984 దరఖాస్తు ఫారాలు అందజేశారు. ఒక్కొక్కరు రెండు మూడింటికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ నామినీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో పాటు యూనివర్సిటీల నామినీలను, యూజీసీ నామినీలతో సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసిందే తప్ప కమిటీల సమావేశాలు జరగలేదు. సెర్చ్ కమిటీల్లో యూనివర్సిటీ నామినీగా నియమించిన వారి నియామకం చెల్లదని, యూనివర్సిటీల పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు (ఈసీ) లేకుండా, ఆ ఈసీలు సిఫారసు చేయకుండా పెట్టిన నామినీల నియామకం కుదరదన్న వాదనలు వచ్చాయి. దాంతో సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి.. ఈసీల నియామకం కోసం ప్రతిపాదలను ప్రభుత్వానికి గత నెలలోనే పంపింది. ప్రస్తుతం అది ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. బుధవారం సీఎం ఆదేశాలు జారీ చేసినందున ఈ వారం రోజుల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను నియమించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఆయా యూనివర్సిటీల నుంచి సెర్చ్ కమిటీల్లో ఉండే యూనివర్సిటీల నామినీల పేర్లను ప్రభుత్వం తెప్పించుకోనుంది. ఆ తర్వాత సెర్చ్ కమిటీలు సమావేశమై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురి పేర్లను ప్రతిపాదించనున్నాయి. మొత్తానికి వచ్చే వారంలో సెర్చ్ కమిటీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సెర్చ్ కమిటీలు ప్రతిపాదించిన పేర్లను ప్రభుత్వం యూనివర్సిటీల ఛాన్స్లర్ అయిన గవర్నర్ ఆమోదానికి పంపనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే గవర్నర్ ఆమోదంతో మార్చి రెండో వారంలో కొత్త వీసీలు రానున్నారు. దరఖాస్తు చేసుకోకున్నా.. యూనివర్సిటీల వీసీలుగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు దరఖాస్తు చేసుకోని వారిని కూడా సెర్చ్ కమిటీ ఎంపిక చేసే వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటికి ప్రొఫెసర్గా పదేళ్ల అర్హత లేని వారు కూడా 42 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని భావించారు. ప్రస్తుతం అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకే వారిని సెర్చ్ కమిటీలు పరిగణనలోకి తీసుకుంటాయా లేదా అన్న విషయంలో చర్చ జరుగుతోంది. అయితే సెర్చ్ కమిటీలు వారి పేర్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. మూడు వారాల్లోగా నియామకం: సీఎం రాష్ట్రంలోని వివిధ విశ్వ విద్యాలయాల ఉపకులపతుల (వైస్ ఛాన్సలర్) నియామక ప్రక్రియను రెండు మూడు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు. వీసీల నియామకానికి వీలుగా వెంటనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. సెర్చ్ కమిటీ ద్వారా వీరి పేర్లను తెప్పించుకోవాలని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లపై స్పష్టత వస్తే వీసీల నియామక ప్రక్రియకు మార్గం సుగమం అవుతుందన్నారు. -
4 నెలల్లో పూర్తి చేయండి
వీసీ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్ల (వీసీ) పోస్టుల భర్తీ ప్రక్రియను మూడు నుంచి నాలుగు నెలల్లోపు పూర్తి చేసి తీరాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీలు, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 10 వర్సిటీలకు వీసీలు లేరని, వీరి నియామకంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే వీసీ పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ, పొట్టి శ్రీరాములు తెలుగు, బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, పాలమూరు, జేఎన్ ఫైన్ఆర్ట్స్ తదితర వర్సిటీలకు వీసీలు లేరని చెప్పారు. ఈ సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు స్పందిస్తూ... గవర్నర్తో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా వీసీలను నియమించాలని భావిస్తోందని, ఈ విషయంలో చట్ట సవరణలు చేయాలని కూడా యోచిస్తున్నామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, సెర్చ్ కమిటీ సిఫారసుల ఆధారంగా వీసీల నియామకం జరగాలి కదా. సెర్చ్ కమిటీలు కూడా ఉండటం లేదా? అని ప్రశ్నించింది. సెర్చ్ కమిటీలు ఉంటాయని, అవిచ్చే నివేదికల ఆధారంగానే నియామకాలను ప్రభుత్వం చేపడుతుందని రామచంద్రరావు తెలిపారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, పూర్తిస్థాయిలో వీసీలను ఎప్పుడు నియమిస్తారు? వీసీలు లేకపోతే వర్సిటీలు, విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించింది. పూర్తిస్థాయిలో వీసీలను నియమించేందుకు ఆరు నెలల గడువు కావాలని రామచంద్రరావు కోర్టును కోరారు. ఆరు నెలలు చాలా ఎక్కువని, మీరు ఏం చేస్తున్నారన్న దాంతో తమకు సంబంధం లేదని, వీసీ పోస్టుల భర్తీ ప్రక్రియను మూడు నుంచి నాలుగు నెలల్లోపు పూర్తి చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.