4 నెలల్లో పూర్తి చేయండి
వీసీ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్ల (వీసీ) పోస్టుల భర్తీ ప్రక్రియను మూడు నుంచి నాలుగు నెలల్లోపు పూర్తి చేసి తీరాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీలు, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది.
రాష్ట్రంలో 10 వర్సిటీలకు వీసీలు లేరని, వీరి నియామకంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే వీసీ పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, జేఎన్‌టీయూ, పొట్టి శ్రీరాములు తెలుగు, బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక, పాలమూరు, జేఎన్ ఫైన్‌ఆర్ట్స్ తదితర వర్సిటీలకు వీసీలు లేరని చెప్పారు.
ఈ సమయంలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు స్పందిస్తూ... గవర్నర్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా వీసీలను నియమించాలని భావిస్తోందని, ఈ విషయంలో చట్ట సవరణలు చేయాలని కూడా యోచిస్తున్నామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, సెర్చ్ కమిటీ సిఫారసుల ఆధారంగా వీసీల నియామకం జరగాలి కదా. సెర్చ్ కమిటీలు కూడా ఉండటం లేదా? అని ప్రశ్నించింది.
సెర్చ్ కమిటీలు ఉంటాయని, అవిచ్చే నివేదికల ఆధారంగానే నియామకాలను ప్రభుత్వం చేపడుతుందని రామచంద్రరావు తెలిపారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, పూర్తిస్థాయిలో వీసీలను ఎప్పుడు నియమిస్తారు? వీసీలు లేకపోతే వర్సిటీలు, విద్యార్థుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించింది. పూర్తిస్థాయిలో వీసీలను నియమించేందుకు ఆరు నెలల గడువు కావాలని రామచంద్రరావు కోర్టును కోరారు. ఆరు నెలలు చాలా ఎక్కువని, మీరు ఏం చేస్తున్నారన్న దాంతో తమకు సంబంధం లేదని, వీసీ పోస్టుల భర్తీ ప్రక్రియను మూడు నుంచి నాలుగు నెలల్లోపు పూర్తి చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.