కిక్కు షురూ..
నెల్లూరు(క్రైమ్): మద్యం కిక్కు షురూ అయింది. 2015 -17 ఆబ్కారీ సంవత్సరానికి లెసైన్సులు పొందిన వ్యాపారుల్లో 50 శాతం మందికి పైగా బుధవారం అరకొర వసతుల నడుమే మద్యం దుకాణాలను ప్రారంభిం చారు. కొత్త భవనాల కోసం వెతుకులాడటం వల్ల సమ యం వృథా అవుతుందని పాత దుకాణాల్లోనే అమ్మకాలు మొదలుపెట్టారు. కొందరు సెంటిమెంట్ కోసం ఒకటి రెండురోజులు ఆలస్యమైనా పర్వాలేదని కొత్త భవనాల కోసం వెతుకులాట ప్రారంభించారు. 2014-15 గడువు మంగళవారం అర్థరాత్రి ముగిసింది. జిల్లాలోని 313 మద్యం దుకాణాలకు గత నెల 29వ తేదీన లాటరీ డ్రా నిర్వహించిన విషయం తెలిసిందే.
నూతన హంగులతో....
మందుబాబులను ఆకట్టుకొనేందుకు మద్యం వ్యాపారు లు దుకాణాలను నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో మద్యం సేవించేలా సిట్టింగ్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులోనే తినేందుకు వివిధరకాలైన ఆహారపదార్థాలు, కూల్డ్రింక్స్లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. విక్రయాల్లో అక్రమాలను నిరోధించేందుకు స్కానర్లు తదితరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.
పలు దుకాణాల్లో మద్యం నిల్....
బుధవారం పలు దుకాణాల్లో మద్యం అందుబాటులో లేకపోవడంతో మందుబాబులు నిరాశతో వెనుదిరిగారు. కొందరు వ్యాపారులు ఐఎంఎల్డిపో నుంచి సకాలంలో మద్యం తీసుకొచ్చుకోవడంతో ఉదయం నుంచే విక్రయాలు ప్రారంభించారు. కొందరికి ఆలస్యం కావడంతో ఆ దుకాణాల్లో మద్యం అందుబాటులో లేకుండాపోయిం ది. తొలిరోజు కావడంతో వ్యాపారులు అన్నీ సమకూర్చుకొనే పనిలో ఉండటంతో మద్యం తాగేందుకు సరైన వసతుల్లేక మందుబాబులు బహిరంగ మద్యపానం చేశారు.
ఐఎంఎల్ డిపో వద్ద సందడి
తొలిరోజు కావడంతో తె ల్లవారుజామునే అధికశాతం మంది మద్యం వ్యాపారులు దేవరపాలెంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్(ఏపీఎస్బీసీఎల్)కు చెందిన ఐఎంఎల్ డిపోకు చేరుకున్నారు. అక్కడ నగదు డిపాజిట్ చేసి ప్రత్యేక వాహనాల్లో మద్యంను దుకాణాలకు తరలించారు. దీంతో దేవరపాలెంలో మద్యం వ్యాపారులు, వివిధ మద్యం కంపెనీలకు చెందిన ప్రతినిధులతో సందడిగా మారింది. మద్యం లారీలు ఐఎంఎల్డిపో వద్ద బారులు తీరాయి.
ఎమ్మార్పీ అమలు జరిగేనా?
ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు సాగించాలని, బెల్టుషాపులను ఉపేక్షించబోమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే వీటి అమలు సాధ్యమేనా? అన్న ప్రశ్న అందరిలో నెలకొంది. గతంలోనూ ఇదే తరహాలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎక్కడా అమలుకు నోచుకోలేదు. వ్యాపారులు సిండికేట్గా మారి ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడడంతో పాటు బెల్టుషాపుల్లో మద్యం ఏరులై పారింది.
ఈ విషయం ఆబ్కారీ శాఖ అధికారులకు తెలిసినా ముడుపులు పుచ్చుకొని మొక్కుబడి దాడులు చేశారని విమర్శలున్నాయి. ప్రతి మద్యం దుకాణంలో కంప్యూటర్ బిల్లింగ్, స్కానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినా అమలుకు నోచుకోలేదు. దేవుళ్ల పేర్లు పెట్టడకూడదని, హైవేకి దూరంగా ఉండాలని నిబంధనలు పాటించాల్సి ఉంది. వీటి గురించి ఎక్సైజ్ అధికారులతో మాట్లాడగా ఈసారి నుంచి తప్పకుండా ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు పాటించని దుకాణాలపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.