Parliament Monsoon session: ‘మణిపూర్’ రగడ..
సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ వరుసగా రెండో రోజు శుక్రవారం సైతం పార్లమెంట్‌ను కుదిపేసింది. ఈ అంశంపై తక్షణమే చర్చ ప్రారంభించాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. నినాదాలు, నిరసనలతో హోరెత్తించడంతో ఉభయసభలు స్తంభించాయి. మణిపూర్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పలువురు కేంద్ర మంత్రులు ప్రకటించారు. అయినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే నోరు విప్పాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే పార్లమెంట్ ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశంపై 267 నిబంధన కింద పూర్తిస్థాయిలో చర్చించాలని, అనంతరం ప్రధానమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అయితే, 176 నిబంధన కింద చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం తేలి్చచెప్పింది. ఇందుకు ప్రతిపక్ష ఎంపీలు అంగీకరించలేదు.
మణిపూర్ రక్తమోడుతోంది
మణిపూర్ అంశంపై లోక్‌సభ, రాజ్యసభలో చర్చించాలని కోరుతూ మంగళవారం ఉదయం ఉభయ సభల ప్రారంభానికి ముందే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ఇతర పారీ్టలు వాయిదా తీర్మానం నోటీసులిచ్చాయి. లోక్‌సభ ఆరంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు తమ స్థానాల్లో లేచి నిల్చున్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. మణిపూర్ కు రక్తస్రావమవుతోంది అని పేర్కొన్నారు.
మణిపూర్‌లో కొనసాగుతున్న దారుణ హింసపై తక్షణమే చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని, సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. శాంతించాలంటూ విపక్షాలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేశారు. సభ సక్రమంగా కొనసాగడం, ప్రశ్నోత్తరాలు నిర్వహించడం మీకు ఇష్టం లేదా? అంటూ ప్రతిపక్షలపై అసహనం వ్యక్తం చేశారు. నినాదాలతో సమస్యకు పరిష్కారం లభించదని, చర్చలే అందుకు మార్గమని సూచించారు.
సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించవద్దని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు. ఈ సమయంలో మాట్లాడేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు స్పీకర్ అనుమతి ఇచ్చారు. మణిపూర్ ఘటనలపై చర్చకు తాము సిద్ధమేనని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ‘‘మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం చాలా హేయమైన చర్య అని, ఈ ఘటన యావత్ దేశం తలదించుకునేలా చేసిందని ప్రధానమంత్రి మోదీ స్వయంగా చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చించాలని ప్రభుత్వం కోరుకుంటోంది.
అయినా ప్రతిపక్షాలు పార్లమెంట్లో చర్చ జరగకుండా గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ అంశంపై చర్చకు విపక్షాలు సీరియస్‌గా లేవని భావిస్తున్నా’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అయినా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గలేదు. నినాదాలు ఆపలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. అయినా ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. గందరగోళం కొనసాగుతుండడంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఆందోళన
మణిపూర్ అంశంపై చర్చకు రాజ్యసభలోనూ విపక్షాలు పట్టుబట్టాయి. సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియాన్ పార్లమెంట్లో ఉపయోగించే పదాలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. మణిపూర్ సమస్యపై మాట్లాడేందుకు సభలో ప్రధానమంత్రి ఉండాలని గురువారం ప్రతిపక్షాలు కోరాయని అన్నారు. అయితే ప్రధానమంత్రి, మణిపూర్ అనే పదాలను రికార్డు నుండి తొలగించారని సభాపతి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు సహా మణిపూర్ అంశంపై విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో రాజ్యసభ తొలుత మధ్యాహ్నం 2.30 గంటల దాకా, ఆ తర్వాత సోమవారానికి వాయిదా పడింది.
లోక్‌సభలో ‘ఇండియా’ ప్లకార్డులు
ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ప్లకార్డులు తొలిసారిగా శుక్రవారం లోక్‌సభలో దర్శనమిచ్చాయి. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి సమాధానం చెప్పాలంటూ విపక్ష సభ్యులు ఈ ప్లకార్డులను సభలో ప్రదర్శించారు. ‘ఇండియా సమాధానం కోరుతోంది. మౌనాన్ని కాదు’, ‘పార్లమెంట్లో ప్రధాని మాట్లాడాలని ఇండియా కోరుతోంది’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు.