రెండోరోజూ నంగునూరులో బంద్
హుస్నాబాద్ డివిజన్లో కలుపొద్దంటూ ఆందోళనలు
పాలమాకులలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం, రాస్తారోకో
నంగునూరు: మండలాన్ని సిద్దిపేట డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గురువారం యువజన సంఘాల ఆధ్వర్యంలో పాలమాకులలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నంగునూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో రెండవ రోజు బంద్ నిర్వహించి షాపులను మూసి వేయించారు.
ఈ సందర్భంగా పాలమాకులలో యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ కొత్త జిల్లా పేరుతో సిద్దిపేట నుంచి తమ మండలాన్ని విడదీయాలని చూస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకొని నంగునూరు మండలాన్ని సిద్దిపేట డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
వర్షం పడుతున్న లెక్కచేయకుండా గంట పాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న రాజగోపాల్‌పేట ఏఎస్ఐ కొమురయ్య అక్కడికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. నంగునూరులో రెండవ రోజు బంద్ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీఐటీయూ నాయకులు ఇమ్రాన్, యాదగిరి, మల్లేశం మాట్లాడుతూ నంగునూరు మండల ప్రజలకు సిద్దిపేటతో ఉన్న అనుబంధాన్ని దూరం చేయాలని మంత్రి హరీశ్‌రావు చూస్తున్నారని ఆరోపించారు. మండలాన్ని సిద్దిపేట డివిజన్‌లోనే ఉంచుతామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన చేస్తామన్నారు.