'తెలంగాణలో ఆంధ్ర ఉద్యోగులు ద్వితీయ శ్రేణి పౌరులు'
వైవీయూ(వైఎస్కార్ జిల్లా): తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రా ఉద్యోగులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఏపీ ఎన్జీఓల అసోసియేషన్ అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబు అన్నారు. కడప ఎన్జీఓల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్లో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం, వారి ఉద్యోగులు సోదర భావంతో వ్యవహరించడం లేదన్నారు. ఏపీఎన్జీఓల కార్యాలయంపై దాడులు చేసిన సమయంలో అక్కడి ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు.
దీనిపై గవర్నర్ను కలిసినా ఫలితం లేదని తెలిపారు. ఏడు నెలలుగా కొందరు ఉద్యోగులకు వేతనాలు సైతం ఇవ్వకుండా ఆ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వీటిపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. శాంతిభద్రతల సమస్య అంటే కేవలం హత్యలు, మాన భంగాలేనా.. ఉద్యోగులపై వివక్ష శాంతిభద్రతల సమస్య కాదా అని ప్రశ్నించారు. అనివార్య కారణాల వల్ల పీఆర్సీ నూతన వేతనాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు.