సెకెండ్ సమ్మర్
సాక్షి, కర్నూలు / కర్నూలు(రాజ్‌విహార్) : ప్రస్తుతం జిల్లాలో సెకెండ్ సమ్మర్ (రెండో వేసవి కాలం) కొనసాగుతోందా.. నాలుగు రోజులుగా మండుతున్న ఎండలను గమనించి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం ఐదు గంటలైనా ఎండ వేడిమి తగ్గడం లేదు. చల్ల గాలి లేకపోవడం వల్ల ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వాతావరణ మార్పుల వల్ల పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారు. జిల్లాలో మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో 34 నుంచి 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం మాత్రం ఆలూరు, ఆదోని చుట్టుపక్కల భారీ వర్షం కురిసింది. ఇది ఆ ప్రాంత వాసులకు కొంత ఊరటనిచ్చింది. భగ్గుమంటున్న ఎండలకు తోడు విద్యుత్ కోతలు కూడా తోడవడంతో జనం సతమతమవుతున్నారు. నాలుగు రోజులుగా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ఎప్పుడుపడితే అప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.