హమ్మయ్య.. ‘ద్వితీయ’కు అనుమతి వచ్చింది!
నిజామాబాద్ అర్బన్ : ఎట్టకేలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) కరుణించి నట్లు తెలిసింది. జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలలో రెండో సంవత్సరానికి అనుమతిచ్చినట్లు సమాచారం. మూడురోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఎంసీఐ సమావేశంలో ఈమేరకు ఆమోదం లభించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కళాశాల అధికారు లు, విద్యార్థులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. సెకండియర్కు అనుమతి వస్తుం దో.. లేదోనన్న ఆందోళన లో ఉన్న వారు హర్షం వ్య క్తం చేస్తున్నారు.
గత ఏడాది ప్రారంభమైన మెడికల్ కళాశాలలో రెండోసంవత్సరం కొనసాగింపునకు సంబంధించి ఫిబ్రవరి 23,24 తేదీల్లో ఎంసీఐ సభ్యులు పరిశీలనకు వచ్చారు. అప్పుడు కళాశాలలో సరైన సౌకర్యాలు లేవంటూ సెకండియర్ కు అనుమతి నిరాకరించారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉండటం, లైబ్రరీ లేకపోవడం, వసతిగృహాలు, ఆటస్థలం, తరగతి గదు ల్లో అసౌకర్యాలను లోపాలుగా చూపుతూ అనుమతికి నిరాకరించారు. దీంతో అధికారుల్లో, విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. రెండో సంవత్సరానికి అనుమతి రాకపోతే కళాశాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈనేపథ్యంలో అధికారులు సమస్యల పరిష్కారానికి నడుంబిగించారు.
రెండోసారి పరిశీలన
డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ జీజీయాబాయి సమస్యల పరిష్కారం కోసం పాటుపడ్డారు. సౌకర్యాలను మెరుగు పర్చిన తర్వాత మరోసారి కళాశాలను పరిశీలించాలని ఎంసీఐను కోరారు. స్పందించిన ఎంసీఐ బృందం ఈనెల 7న మరోసారి మెడికల్ కళాశాలను పరిశీలించారు. ఈసారి సంతృప్తి చెందిన సభ్యులు ఎంసీఐ సమావేశంలో రెండోసంవత్సరానికి అనుమతికి ఆమోదం తెలిపినట్లు తెలిసింది. వందసీట్లను కేటాయిస్తూ అనుమతి మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. వారంరోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇంకా ఆదేశాలు అందలేదు
నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల కు రెండో సంవత్సరం అనుమతికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు. ఎంసీఐ మాత్రం సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది. మరో వారం రోజుల్లో స్పష్టమైన ఆదేశాలు రావచ్చు.
-శ్రీనివాస్, డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్