సీక్రెట్‌గా మెసెంజర్ సంభాషణ
ఫేస్బుక్ మెసెంజర్ నుంచి సీక్రెట్‌గా మెసేజ్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇది ఇప్పటినుంచి సాధ్యమవుతుందట. ఫేస్బుక్ తన మెసెంజర్ యాప్‌కి ఎండ్-టూ-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫీచర్‌ను తెచ్చేసింది. రహస్య సంభాషణ(సీక్రెట్ కన్వర్జేషన్) పేరుతో తన యాప్ యూజర్లకు ఎండ్-టూ-ఎండ్ ఎన్ క్రిప్షన్ ను ఆవిష్కరించింది. యూజర్లు ఎంపిక చేసుకున్న సంభాషణలకు పూర్తిగా ఎన్ క్రిప్షన్ సౌకర్యాన్ని ఫేస్బుక్ ఇకనుంచి కల్పించనుంది. అయితే సింగిల్ డివైజ్‌లో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందని ఫేస్బుక్ పేర్కొంది. ఒక డివైజ్ ద్వారా సీక్రెట్ సంభాషణ చేసి, మరొక డివైజ్‌లో ఆ సంభాషణ చూడాలనుకుంటే కుదరదని ఫేస్ బుక్ వెల్లడించింది.
అయితే ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ కస్టమర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి వస్తుందని... డెస్క్‌టాప్‌లో వాడే మెసెంజర్‌కు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదని ఫేస్బుక్ వెల్లడించింది. ఈ ఫీచర్‌ను ప్రతి చాట్‌కు యూజర్లు మాన్యువల్‌గానే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ లాగా అన్ని చాట్లకు ఈ ఫీచర్ వర్తించదు. మెసెంజర్ యాప్‌ను ఓపెన్ చేసుకుని, సీక్రెట్ సంభాషణ ఎవరితో చేయాలనుకున్నారో వారిని యూజర్లు ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ పేరును టాప్ చేసి పట్టుకోవడంతో, రహస్య సంభాషణ ఫీచర్ వారికి యాక్టివేట్ అవుతోంది. సీక్రెట్ కన్వర్జేషన్ ఆప్షన్‌కు తర్వాత ఐకాన్‌గా టైమర్ ఉండనుంది. ఈ ఆప్షన్‌తో యూజర్లు మెసేజ్‌లు కనిపించకుండా పోవడానికి టైమ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. అయితే జీఐఎఫ్స్, వీడియోస్ లాంటి కొన్ని ప్రముఖ ఫీచర్లకు ఈ సీక్రెట్ సంభాషణ వర్తించదని ఫేస్బుక్ తెలిపింది.