65.33 లక్షల మందికి రూ.1,800.96 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65,33,781 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ రకాల చేతి వృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు డిసెంబర్ 1న ఠంచన్‌గా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,800.96 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు గురువారం పేర్కొన్నారు. పింఛన్ నగదును ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించినట్లు చెప్పారు. సచివాలయాల వలంటీర్లు శుక్రవారం తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ సొమ్మును అందజేస్తారని తెలిపారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు.
లబ్ధిదారులకు పింఛన్ అందజేసే సందర్భంలో గుర్తింపు కోసం ఆధార్ నిర్ధారిత బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలను అమలు చేస్తున్నామన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఐదు రోజుల్లోనే నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 15 వేల మంది సంక్షేమ, విద్య అసిస్టెంట్, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులు భాగస్వాములు అవుతారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని డీఆర్డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని తెలిపారు.