పూలకుండీలతో సరిహద్దులు
ఏ,బీ,సీ,డీ బ్లాకులు తెలంగాణకు.. మిగతావి సీమాంధ్రకు
సాక్షి, హైదరాబాద్: సచివాలయ విభజనలో గోడలు, ముళ్లకంచెలకు అవకాశం లేదు. కేవలం పూల కుండీల ఏర్పాటుతో హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర పారిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయాన్ని ఇటు తెలంగాణకు, ఇటు సీ మాంధ్ర ప్రభుత్వాలకు విభజిస్తూ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుకు ఆమోదం తెలిపారు. త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. అనంతరం విభజనకు గుర్తుగా పూలకుండీలను ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ ఒకే ఆవరణలో ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు పనిచేయాల్సి ఉన్నందున ఇరు రాష్ట్రాలకు చెందిన బ్లాకుల సరిహద్దుల్లో పూలకుండీలను ఏర్పాటు చేస్తారు. ఏ,బీ,సీ,డీ బ్లాకులను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయిం చారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసే వారి రాకపోకల కు ప్రస్తుతం ఉన్న స్కూల్ దగ్గర నుంచి గేట్లను ఏర్పాటు చేస్తారు. స్కూల్‌ను మరోచోటుకు తరలిస్తారు. ప్రస్తుతం ఉన్న సీ బ్లాకు సీఎం కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటారు. సీమాంధ్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సౌత్ హెచ్ బ్లాకు రెండో అంతస్తులో ఏర్పాటు చేస్తారు.
సీమాంధ్ర ప్రభుత్వానికి సౌత్ హెచ్ బ్లాకుతో పాటు నార్త్ హెచ్, జె, కె, ఎల్ బ్లాకులను కేటాయించారు. ప్రస్తుతం ఉన్న ద్వారం ద్వారా సీమాంధ్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ఉద్యోగులు రాకపోకలు కొనసాగిస్తారు. సౌత్ హెచ్ బ్లాకులో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని వచ్చే నెల 17వ తేదీన ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. అదే బ్లాకులో ఉన్న ఆంధ్రా బ్యాంకు, గ్రంథాలయాన్ని కూడా ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆంధ్రా బ్యాంకును గతంలో జె బ్లాకులో ఉన్న చోటికే తరలించనున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని కె బ్లాకులోకి తరలించనున్నా రు. ప్రస్తుత సీఎం క్యాంపు కార్యాలయాన్ని, అధికార ని వాసాన్ని తెలంగాణ సీఎంకు కేటాయించారు. సీమాంధ్ర సీఎం అధికారిక నివాసం, క్యాంపు కార్యాలయంగా గ్రీన్‌ల్యాండ్స్ అతిధి గృహాన్ని కేటాయించారు.