ఇక ఏకగ్రీవమే ముగిసిన నామినేషన్ల పరిశీలన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాజ్యసభ, శాసన మండళ్ల ద్వైవార్షిక ఎన్నికలకు వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్నాయి. ఖాళీలకు తగిన సంఖ్యలోనే అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినందున, ఈ నెల 19న ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసన సభ కార్యదర్శి ఓం ప్రకాశ్ మంగళవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా బీకే. హరిప్రసాద్, రాజీవ్ గౌడ, బీజేపీ అభ్యర్థిగా ప్రభాకర కోరె, జేడీఎస్ అభ్యర్థిగా కుపేంద్ర రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
నాలుగు ఖాళీలకు నలుగురే నామినేషన్లు దాఖలు చేసినందున, వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. స్వతంత్ర అభ్యర్థులుగా మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, నిబంధనల మేరకు లేనందున తిరస్కరించారు. శాసన మండలిలోని ఏడు ఖాళీలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా డాక్టర్ జీ. పరమేశ్వర, జయమ్మ బాలరాజ్, బోసు రాజు, హెచ్ఎం. రేవణ్ణ, బీజేపీ అభ్యర్థిగా కేఎస్.
ఈశ్వరప్ప, జేడీఎస్ అభ్యర్థిగా శరవణ, ఈ రెండు పార్టీలు బలపరిచిన మరో అభ్యర్థి యుగంధర్ నామినేషన్లు దాఖలు చేశారు. అదనపు అభ్యర్థులెవరూ రంగంలో లేనందున వీరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం వరకు గడువుంది. అదే రోజు సాయంత్రం వీరంతా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు.