సికింద్రాబాద్ బాలుడు ఒంగోలులో ప్రత్యక్షం
ఒంగోలు క్రైం : సికింద్రాబాద్‌లోని పద్మశాలినగర్‌లో నివాసం ఉంటున్న దండి నిశ్చయత్ ప్రసాద్ (12) సోమవారం ఒంగోలులో ప్రత్యక్షమయ్యాడు. శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ మంచినీటి కోసం ఒంగోలు రైల్వేస్టేషన్లో దిగి తాగుతుండగా రైలు బయల్దేరి వెళ్లిపోయింది. రెండో ప్లాట్‌ఫాంపై ఏడుస్తూ కూర్చున్న ఆ బాలుడిని రైల్వేస్టేషన్ మేనేజర్ షేక్ మహ్మద్‌ఆలీబాషా గమనించి ఒంగోలు రైల్వే జీఆర్పీ ఎస్సై పి.భావనారాయణకు సమాచారం అందించారు. ఎస్సై వచ్చి ఆ బాలుడిని చేరదీసి చైల్డ్‌లైన్ ప్రతినిధి బీవీ సాగర్‌కు సమాచారం అందించారు.
సాగర్ జీఆర్పీ పోలీసుస్టేషన్‌కు వెళ్లి బాలుడికి సంబంధించిన వివరాలు సేకరించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో ఏడో తరగతి చదువుతున్న నిశ్చయత్ ప్రసాద్‌కు తండ్రి రాజేష్ ఏడాది క్రితం చనిపోయాడు. తల్లి సరిత బాలుడిని తరుచూ కొట్టడం, వేధించటం వంటివి చేస్తుండటంతో శ్రీకాళహస్తిలోని తన పెద్దనాన్న వద్దకు వెళ్లాలని శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. శ్రీకాళహస్తి సమీపంలోని దైనేడులో ఉంటున్న బాలుడి పెదనాన్నతో సాగర్ ఫోన్లో మాట్లాడారు. తన తమ్ముడికి తనకు కొన్నేళ్ల క్రితం గొడవలు వచ్చాయని, మనస్పర్థల కారణంగా తమ కుటుంబాల మధ్య సంబంధాలు లేవని, ఆ బాలుడితో తనకెలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పాడు. చేసేది లేక బాలుడిని బాలల సంక్షేమ మండలి సభ్యుల ముందు హాజరు పరిచారు. వారి ఆదేశాల మేరకు ఆ బాలుడిని హౌసింగ్ బోర్డులోని హోంకు తరలించారు.