మోదీ, పారికర్తో గవర్నర్ సమావేశం
న్యూఢిల్లీ : హస్తిన పర్యటనలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బిజీ బిజీగా ఉన్నారు. ఆయన గురువారం పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులపై నివేదిక సమర్పించారు. అలాగే రాష్ట్రాల్లోని తాజా పరిణామాలపై మోదీతో చర్చించారు. వీరి భేటీ సమారు గంటపాటు కొనసాగింది. ప్రధానితో భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు కరువు సహాయక చర్యలను ముమ్మరం చేశాయన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు గవర్నర్ నిరాకరించారు.
ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర రక్షణమంత్రి పారికర్తో నరసింహన్ సమావేశమయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో రోడ్ల మూసివేత వివాదంపై ఆయనతో చర్చించారు. కంటోన్మెంట్ ఏఓసి సెంటర్ రహదారి వివాదంపై ఆర్మీ అధికారులతో రక్షణశాఖ చర్చించనుంది. కంటోన్మెంట్ ఏఓసి సెంటర్ రహదారిలో సామాన్య ప్రజానీకం చేయకుండా ఆర్మీ అధికారులు గతంలో నిషేధాజ్ఞలు విధిస్తామంటూ గతంలో బహిరంగ ప్రకటన చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు లేఖలు కూడా రాసింది.
అప్పట్లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కూడా ప్రజాసౌకర్యార్ధం ఈ రహదారిని మూసివేయవద్దని కేంద్ర రక్షణశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతో 2016 మే 31వ తేదీ వరకు ఆంక్షల్ని సడలిస్తున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆలోపు రాష్ట్రప్రభుత్వం ప్రత్యామ్నాయ రహదారిని నిర్మించాలని సూచించింది. గడువు దగ్గర పడటంతో ఆ అంశాన్ని గవర్నర్ ఈ సందర్భంగా రక్షణమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.