secunderabad mp
-
పూలొద్దు.. పుస్తకాలివ్వండి
అంబర్‌పేట: ‘పూలొద్దు.. పుస్తకాలివ్వండి. పేద విద్యార్థులకు చేయూతనివ్వండి’ అంటూ ఎంపీ కిషన్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన ఆయనకు అభినందనలు తెలిపేందుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అయితే వారందరూ పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావడంపై ఎంపీ ఇలా స్పందించారు. వీటికి బదులు నోట్ పుస్తకాలు అందజేస్తే అవి తాను పేద విద్యార్థులకు అందజేస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. కిషన్‌రెడ్డి సూచనల మేరకు పలువురు అభిమానులు నోట్ పుస్తకాలను అందించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కిషన్‌రెడ్డికి నోట్ పుస్తకాలిచ్చి శుభాకాంక్షలు తెలిపాయి. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రేమ్‌నగర్‌కు చెందిన హైమావతి పాఠశాల కరస్పాండెంట్ నిరంజన్, స్వామి దయానంద పాఠశాల కరస్పాండెంట్ రవికుమార్, బీజేపీ నాయకులు చంద్రశేఖర్, అజయ్‌కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, శ్యామ్ తదితరులు ఉన్నారు. -
'మైనారిటీల రిజర్వేషన్లకు మా పార్టీ వ్యతిరేకం'
హైదరాబాద్: రాజ్యాంగ విరుద్దమైన మైనారిటీల రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ స్సష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 'ఉచిత విద్య'ను అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఆ పథకం అందరికి వర్తిస్తుందో లేదా వెల్లడించాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే 371 డీ నిబంధన, ముల్కి స్థానికత ఉన్నాయి. అలాంటప్పుడు 1956 స్థానికత ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకువెళ్లాలని బండారు దత్తాత్రేయ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.