'మైనారిటీల రిజర్వేషన్లకు మా పార్టీ వ్యతిరేకం'
హైదరాబాద్: రాజ్యాంగ విరుద్దమైన మైనారిటీల రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ స్సష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 'ఉచిత విద్య'ను అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఆ పథకం అందరికి వర్తిస్తుందో లేదా వెల్లడించాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇప్పటికే 371 డీ నిబంధన, ముల్కి స్థానికత ఉన్నాయి. అలాంటప్పుడు 1956 స్థానికత ఎలా సాధ్యమంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలు అరికట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అఖిలపక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకువెళ్లాలని బండారు దత్తాత్రేయ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.