మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా శనివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, మాజీ ఎంపీ అల్లాడి రాజ్‌కుమార్ తదితరులతో కలసి ఆయన అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ ఈవో అశోక్‌గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు అంటే తనకు ఎంతో నమ్మకమని.. గత 20 ఏళ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలందరు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు బాబు తెలిపారు.
అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ తదితర కాంగ్రెస్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు.