పర్యాటకంగా సముద్రతీరం అభివృద్ధి
జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్
సైకిల్ మీద బీచ్ రోడ్డు ద్వారా
కాకినాడ నుంచి అన్నవరానికి
సతీసమేతంగా సత్యదేవునికి పూజలు
అన్నవరం (ప్రత్తిపాడు) :
జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన కాకినాడ నుంచి అన్నవరం వరకూ బీచ్ రోడ్డు మీదుగా సైకిల్ తొక్కారు. దారి మధ్యలో అనేక సముద్రతీర గ్రామాలలో ఆగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన రత్నగిరికి చేరుకుని సతీసమేతంగా సత్యదేవుని వ్రతం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సప్తగిరి అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత గ్రామాలలో బహిరంగ మలవిసర్జన చేస్తున్నట్టు తన పరిశీలనలో తేలిందని, ఈ సమస్య పరిష్కారానికి ప్రజలలో అవగాహన కల్పించాలని నిర్ణయించినట్టు చెప్పారు. రెండు వేల మంది జనాభా కలిగిన గ్రామాల్లో ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ’ ద్వారా చెత్తను సేకరించి వర్మీ కంపోస్టు తయారు చేయిస్తామని, దీన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఉప్పాడ వద్ద రోడ్డు సముద్ర కోతకు గురవుతోందని, దీని నివారణకు ప్రాజెక్ట్ రిపోర్టు ఇవ్వాలని పూణేలో ఉన్న ఒక ఇనిస్టిట్యూట్‌ను కోరినట్టు చెప్పారు. ఇచ్చాపురం నుంచి తడ వరకూ బీచ్ కారిడార్ ఏర్పాటు కాబోతోందని, అందులో భాగంగా ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రతి ఆదివారం ఈ విధంగా సైకిల్ మీద వివిధ గ్రామాలు పర్యటించడం ముందు ముందు కూడా కొనసాగిస్తానని చెప్పారు.
పంచాయితీలలో ఇళ్ల పన్ను తక్కువే పెంచాం:
గ్రామపంచాయితీలలో ఇంటిపన్ను భారీగా పెంచారని వస్తున్న విమర్శలు సరికాదని కలెక్టర్ అన్నారు. ఇంటిపన్ను పెంచకముందు జిల్లాలో పంచాయతీలకు వచ్చే ఆదాయం రూ.70 కోట్లు ఉంటే, పెంచాక ఆ మొత్తం రూ.87 కోట్లు మాత్రమే అయిందన్నారు. కలెక్టర్ వెంట అన్నవరం దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు తదితరులున్నారు.