రైతన్న కన్నెర్ర
పత్తికొండ టౌన్: సబ్సిడీ వేరుశనగ కావాలంటే తప్పనిసరిగా విత్తనశుద్ధి మందు కూడా కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు నిబంధనలు విధించడంతో రైతన్నలు రోడ్డెక్కారు. కాలం చెల్లిన మందులు తీసుకొని ఏం చేయాలని ఆగ్రహించారు. పత్తికొండలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన కౌంటర్లలో తుగ్గలి మండల రైతులకు బయోమెట్రిక్ ద్వారా విత్తనపర్మిట్లు జారీ చేస్తున్నారు. వీటిని తీసుకునేందుకు ఆ మండలం నుంచి అధికసంఖ్యలో రైతులు మార్కెట్‌యార్డుకు చేరుకున్నారు. ఒక్కో రైతుకు పాసుపుస్తకానికి 4 ప్యాకెట్లు(30కిలోలు) వేరుశనగకాయలు ఇస్తున్నారు. దీంతో పాటు రూ.200 విలువచేసే నాలుగు ప్యాకెట్ల విత్తనశుద్ధి మందు కొనుగోలు చేయాలని వ్యవసాయ సిబ్బంది మెలిక పెట్టారు. ఆ పాతస్టాకు మందు తమకు వద్దని వేరుశనగకాయలు మాత్రమే పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారులు వినకపోవడంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్‌యార్డు బయట ఉన్న పత్తికొండ–గుత్తి ప్రధాన రహదారిపై బైఠాయించారు.
విషయం తెలుసుకుని తుగ్గలి మండల వ్యవసాయాధికారి మునెమ్మ అక్కడకు రాగా రైతులు, ఏపీ రైతుసంఘం నాయకులు సమస్య వివరించారు. వెంటనే ఏఓ ఫోన్లో జేడీఏ ఉమామహేశ్వరమ్మతో మాట్లాడగా ఒక విత్తనశుద్ధి ప్యాకెట్ కొనుగోలు చేసినా వేరుశనగ ఇవ్వాలని ఆమె సూచించారు. ఇందుకు సమ్మతించిన రైతులు ఆందోళన విరమించి వేరుశనగ విత్తన పర్మిట్లు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే రైతులు ఆందోళనతో గంటపాటు రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఆందోళన కార్యక్రమంలో
ఏపీ రైతుసంఘం జిల్లా సహాయకార్యదర్శి రాజాసాహెబ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురుదాస్, మండల కార్యదర్శి కారన్న, ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి సుల్తాన్ పాల్గొనా్నరు.