సీడ్‌హబ్.. అధికారుల గుండెల్లో లబ్‌డబ్
నంద్యాల: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రకటించిన సీడ్ హబ్ అధికారులకు సవాల్‌గా మారింది. ఇది కొత్త ప్రాజెక్టు కావడంతో అవగాహన కోసం అధికారులు అవస్థలు పడుతున్నారు. నంద్యాల ప్రాంతంలో అన్ని రకాల విత్తనాలు పండుతాయి. దేశంలో ఎక్కడ ఇలాంటి అవకాశం ఉండదు. అయినా సీడ్ హబ్‌ను ఎలా రూపొందించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15న జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబునాయుడు నంద్యాల పట్టణంలో సీడ్ హబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ హామీ అమలు కోసం అధికారులు లోతుగా విచారణ ఆరంభించారు. ఈ హామీ అమలు జరిగితే దేశంలోనే మొదటి సారి ఇలాంటి కార్యక్రమాన్ని నంద్యాలలో అమలు చేసినట్లు అవుతుందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అధికారులకు సవాల్‌గా మారింది. నంద్యాల పట్టణంలో సీడ్ వ్యాపారులదే పై చేయిగా ఇంత కాలం కొనసాగుతూ వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే హబ్ ప్రైవేటు సంస్థల గుప్పిట్లోకి వెళ్తుందా.. లేక ప్రభుత్వమే నేషనల్ సీడ్ సంస్థలాగా కొనసాగిస్తుందా అనే చర్చ జరుగుతోంది.
ప్రాథమికంగా ఈ నెల 22న సాయంత్రం 3గంటలకు నూనెపల్లెలోని వైఎస్సార్ భవనంలో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆలోపల కలెక్టర్‌కు అవగాహన కలిగించడానికి జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఠాగూర్‌నాయక్ మంగళవారం స్థానిక వ్యవసాయ ఏడీఏ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థానిక అధికారులకు ఈ అంశంపై అవగాహన లేకపోవడంతో జేడీఏ అడిగిన ప్రశ్నలకు నీళ్లు నమిలారు.
సీడ్ హబ్ ఏర్పాటు చేయడానికి నంద్యాల అనువైన స్థలమే అయినా సీడ్‌ను భారీ ఎత్తున పండించడానికి అవసరమైన సాగునీటి గ్యారెంటీ ఎంత వరకని వ్యవసాయ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నంద్యాల ప్రాంతంలో పత్తి, వేరుశెనగ, బీపీటీ 5204 వరి రకంతో పాటు కంది, కొర్ర, జొన్న, తదితర పంటలను భారీగా పండిస్తున్నారు. ఈ రకాలకు చెందిన విత్తనాలన్నింటిని సీడ్ హబ్ ద్వారా అందజేయవచ్చని, అయితే శ్రీశైలం జలాశయంలో 854అడుగుల కనీస నీటి మట్టం కొనసాగిస్తే తప్ప విత్తనాల పెంపకానికి అనుకూలత ఏర్పడదని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
విత్తనాల తయారీలో నేషనల్ సీడే ఫస్ట్: నంద్యాల పట్టణంలోని జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో విత్తనాలను తయారు చేస్తోంది. ఈ సంస్థ ఏడాదికి రూ.22కోట్ల వరకు వ్యాపారం నిర్వహిస్తోంది. వేరుశనగ విత్తనాన్ని స్థానిక రైతులకే కాకుండా జైపూర్‌ప్రాంతానికి 1800క్వింటాళ్లు, కలకత్తాకు 2500క్వింటాళ్లు, బెంగుళూరుకు 2వేల క్వింటాళ్లు, తమిళనాడుకు 500క్వింటాళ్లు, పూనాకు 550క్వింటాళ్లు, భూపాల్‌కు 500క్వింటాళ్లు, పాట్నాకు 2300క్వింటాళ్లు స్థానికంగా తయారు చేసి ఏటా ఎగుమతి చేస్తున్నారు.
అలాగే బీహార్‌కు కంది 220 క్వింటాళ్లు, మధ్యప్రదేశ్‌కు 1500 క్వింటాళ్లు, కలకత్తాకు 1800 క్వింటాళ్లు ఎగుమతి చేస్తుండగా పశ్చిమ బెంగాల్‌కు 1500 క్వింటాళ్ల జనుము, భూపాల్‌కు 1750 క్వింటాళ్ల మినుమును ఎగుమతి చేస్తున్నారు. మొత్తం ఐదు రకాల విత్తనాలను 25రకాలుగా రూపొందించి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇటీవలనే రూ.1.50కోట్లతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా వరి, మినుము, కంది, వేరుశెనగ, జనుము ఉన్నాయి. ఇదే తరహాలో నూతనంగా ఏర్పాటు చేసే హబ్‌లో విత్తనాలను తయారు చేయాల్సి ఉంటుందని అంటున్నారు.