వేరుశనగ విత్తనం కోసం రైతుల ఆందోళన
నాసిరకం విత్తనాన్ని తిరస్కరించిన అన్నదాతలు
కళ్యాణదుర్గం : వేరుశనగ సబ్సిడీ విత్తనం వెంటనే అందజేయాలని మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. నాలుగు రోజులుగా సబ్సిడీ విత్తనం కోసం యార్డులోనే రాత్రింబవళ్ళు నిరీక్షిస్తున్నామని రైతులు వాపోయారు. 60 శాతం సబ్సిడీతో విత్తనోత్పత్తి పథకం కింద విత్తనం కోటా పంపిణీ పూర్తి అయ్యింది. 60 శాతం సబ్సిడీతో ఐదు మండలాలకు 900 కింటాళ్ల సబ్సిడీ విత్తనాన్ని సరఫరా చేశారు.
30 కిలోల బస్తా రూ.800 ప్రకారం రైతులకు అందజేశామని అధికారులు చెబుతున్నారు. కాగా 33 శాతం సబ్సిడీతో విత్తనం పొందాలంటే 30 కిలోల బస్తాకు రూ.1200 చెల్లించాలని అధికారులు చెబుతున్నారని రైతుల వాపోయారు. నాసిరకం విత్తనాన్ని పంపిణీ చేస్తున్నారని అనంతపురం నుంచి విజేత ఆగ్రోస్సీడ్స్ సంస్థ నుంచి సరఫరా అయిన వంద కింటాళ్లను రైతులు తిరస్కరించారు. కుందుర్పి మండలానికి చెందిన రైతులు విత్తనం కోసం ఏఓ వాసుకిరాణిని డిమాండ్ చేశారు.
ఆమె మాట్లాడుతూ రైతుల వినతిమేరకు ప్రత్యేక శ్రద్ధతో 33 శాతం సబ్సిడీ విత్తనాన్ని తెప్పించానని తెలిపారు. అయితే రైతులు విత్తనం నాసిరకంగా ఉందని, తీసుకోడానికి నిరాకరించడంతో దానిని వెనక్కు పంపుతున్నామన్నారు. కాగా రైతులు మాట్లాడుతూ 60 శాతం సబ్సిడీతో విత్తనం అందజేయాల్సిందేనని పట్టుపట్టారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. నాణ్యతగల విత్తనం రాగానే 33 శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తామని చెప్పారు.