కృష్ణా తీరంలో వలస పక్షుల కోలాహలం
ఆత్మకూరురూరల్: సంగమేశ్వర క్షేత్రం విదేశీ పక్షుల వలసకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. సాధారణంగా సముద్ర తీరంలో కనిపించే సీగుల్ పక్షులు గత పది సంవత్సరాలుగా శీతాకాల ఆరంభంలో కృష్ణాతీరానికి గుడ్లు పెట్టి పొదిగి వేసవి మొదలు కాగానే తన పిల్లలతో కలసి తిరిగి ఆర్కిటిక్ తీరానికి పయనమై పోతాయి. డాబ్ చిక్, పెయింటెడ్ స్టార్క్‌లు, పెలికాన్లు, సహజంగానే ఇక్కడకు దేశీయ అంతర్గత వలసల్ల భాగంగా వస్తున్నాయి. కాగా ఈ ఏడాది విచిత్రంగా టెర్న్ పక్షులు కూడా కృష్ణా తీరంలో ఽకనిపించడం పక్షి ప్రేమికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో టెర్న్ పక్షులు కనిపిస్తున్నప్పటికీ ఇవి ప్రధానంగా అంటార్కిటికా, ఆర్కిటికా ధృవ ప్రాంతాల్లో అధికంగా నివసిస్తాయి. ఈ పక్షులు చూడడానికి కాస్త సైజ్‌లో పెద్ద పిచుకలా ఉన్నప్పటికి వలస కోసం కనీసం 30 వేల కి.మీ. దూరాన్ని ఏకధాటిగా ఎగరగలుగుతుంది. గుంపులు గుంపులుగా ఇవి విశాల జలాశయాల వద్ద, సముద్ర తీరాల్లో కనిపిస్తాయి.