తనకు తానే సమాధైన కాంగ్రెస్
సాక్షి, విజయవాడ :
ఫిబ్రవరి 18.. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ తనకు తాను సమాధైన రోజు... ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారం. ఇది జిల్లా విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమవుతోంది. విభజన బిల్లుకు ఆమోదముద్ర పడిన వెంటనే అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మూతపడ్డాయి. మంత్రి పార్థసారథి తన పదవికి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేశారు.
ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు. నగరానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ భవితవ్యంపై తర్జనభర్జన పడుతున్నారు. ‘ఒక పదవిని అడ్డం పెట్టుకుని ఎంతకాలం ఉంటారు. పదవులు వదిలి రండి. మిమ్మల్ని మళ్లీ గెలిపించే బాధ్యత మేం తీసుకుంటాం. రాజీనామాలు చేయకపోతే మీ రాజకీయ భవిష్యత్‌కు తెరపడినట్లే.’ అని ఉద్యోగ సంఘాలు విన్నవించినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కుర్చీలనే అంటిపెట్టుకున్నారు. తాము విభజనను అడ్డుకుని తీరుతామంటూ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు రాజీనామాలు చేసి వేరే పార్టీలలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో చర్చలు జరిపిన మంత్రి సారథి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, గన్నవరం మాజీ శాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆ పార్టీనే వీడారు. లగడపాటికి రాజకీయ సన్యాసం అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పేరెత్తే నాథుడే లేకుండా పోయే పరిస్థితి దాపురించింది.