20న ఆంటోనీ కమిటీ వద్దకు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు
ఈ నెల 20న ఢిల్లీకి వెళ్లి ఆంటోని కమీటీని కలవాలని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులతో వారి సమావేశం ఐదున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. 20న 10మంది సభ్యులు ఢిల్లీకి వెళ్లి సమైక్యవాదం వినిపించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై హైకమాండ్ వెనక్కి తగ్గదని పీసీసీ చీఫ్ బొత్స ఈ సందర్భంగా నేతలకు చెప్పారు. సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి ఆంటోనీ కమిటీ ముందుకెళ్లాలని ఆయన సూచించారు. అయితే... రాష్ట్ర విభజన అనివార్యమైతే అసలీ సమావేశం పెట్టడం ఎందుకని కొంతమంది ఎమ్మెల్యేలు బొత్సను నిలదీసినట్లు తెలిసింది.
హైదరాబాద్, నదీజలాలు, కొత్త రాజధాని ఏర్పాటు లాంటి అంశాలు తేలాలి కదా అని బొత్స సత్యనారాయణ వారితో అన్నారని సమాచారం. కానీ.. ఎమ్మెల్మేలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. విభజన అనివార్యమైతే తమ దారి తాము చూసుకుంటామని కొందరు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని ఆంటోని కమిటీ ముందు కూడా తెగేసి చెబుతామని కుండ బద్దలు కొట్టారు. హైకమాండ్ సూచన మేరకే తాము కూడా ఈ విషయాలు చెబుతున్నామని బొత్స వారికి తెలిపారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. రాజీనామా దిశగా సీమాంధ్ర కేంద్ర మంత్రుల్ని ఒప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు తర్వాత ఆంటోని కమిటీని సీమాంధ్రలో పర్యటించాలని కోరనున్నట్లు వారు చెప్పారు.