రఘు దీక్ష భగ్నం
ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ విద్యుత్ జేఏసీ కో ఆర్డినేటర్
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర విద్యుత్ సమ్మెలో అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యాజమాన్య, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో ఆర్డినేటర్ రఘు చేపట్టిన 48గంటల నిరాహార దీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఉదయం 9గంటలకే ఉద్యోగులు ఎవరూ కార్యాలయానికి రాకముందే రఘును అరెస్ట్‌చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అయితే రఘు ఆసుపత్రిలోనూ దీక్షను కొనసాగిస్తున్నారు. ఆసుపత్రిలోని ఏఎంసీ వార్డులో కిందకూర్చుని నిరసన వ్యక్తం చేశారు. తన దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ కుట్ర అని ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఆరోపించారు. సీఎం కిరణ్ అసాంఘిక శక్తుల కుట్రలో భాగస్వామిగా మారుతున్నారని ధ్వజమెత్తారు. ఉస్మానియా ఆసుపత్రిలో రఘును టీజేఏసీ ఛైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరామ్ పరామర్శించారు. రఘు అరెస్ట్ వార్త తెలుసుకున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ సౌధ వద్దకు చేరుకొని నిరసనలకు దిగారు.