సింగపూర్ కాదు గుక్కెడు నీళ్లివ్వండి..
చంద్రబాబు పేరెత్తితే చాలు పల్లెల్లో జనం ఇప్పటికీ భయపడుతున్నారు. కరెంటు బిల్లులు కట్టలేదని మోటార్లు ఎత్తుకెళ్లిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు. ఆస్పత్రుల్లో వేలకు వేలు పోసి వైద్యాన్ని కొనుక్కున్న భయానక పాలనను తలుచుకుని కుమిలిపోతున్నారు. విధి వైపరీత్యమో, బాబు అధికారం చేపట్టిన వేళా విశేషమో తెలియదు గానీ, తొమ్మిదేళ్ల ఆయన పాలనలో నరకం చూశామంటున్నారు. బాబు హయాంలో చేపట్టిన ఒక్క పథకం కూడా సామాన్య ప్రజలకు, పేద రైతులకు మేలు చేయలేదని వాపోయారు. అద్దంకి, దర్శి, మార్కాపురం, కనిగిరి, కందుకూరు ప్రాంతాల్లో ‘సాక్షి’ ప్రతినిధి నిర్వహించిన రోడ్‌షోలో ప్రజలు ఏమన్నారో.. వారి మాటల్లోనే..
ప్రకాశం జిల్లా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి జి.రామచంద్రారెడ్డి
ఇంటికో ఉద్యోగం ఇస్తానంటున్న చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారని, సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటున్న ఆయన ఈ సింగపూర్ నిర్మాణాలు ఏ పథకంలో భాగమో చెప్పాలని ప్రకాశం జిల్లావాసులు డిమాండ్ చేశారు. గత ఎన్నికల మేనిఫెస్టోలోని ‘నగదు బదిలీ’ పథకాన్ని ప్రస్తుత మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదన్నారు. రూ.70 పింఛన్ ఇచ్చేందుకు ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వాగ్దానాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజల పక్షాల నిలబడి ఇచ్చిన మాట ప్రకారం ఉచిత కరెంటు ఇచ్చారన్నారు. హామీ ఇవ్వకుండానే పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించారని గుర్తు చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించి గుక్కెడు నీళ్లిచ్చిన మహానేతను ఒంగోలు ప్రజలు ఎలా మర్చిపోగలరన్నారు.
తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు?
బాబు హయాంలో కరెంటు మోటార్లు లాక్కెళ్లిన సంగతి గుర్తుంది..
ప్రకాశం జిల్లా సాక్షి రోడ్ షోలో సామాన్యుల ఆవేదన
తొమ్మిదేళ్ల భారం మళ్లీ ఎందుకు?
చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలపై భారాలు మోపారు. మళ్లీ ఇప్పుడు ఆయన పాలన అవసరమా? మంచినీళ్లు లేక అల్లాడుతుంటే సింగపూర్లు కట్టుకుని ఏం చేయాలి? ఆయన పాలనలో రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆయన సింగపూర్‌లోనే ఉంటే రాష్ట్రానికి మంచిది.
- పల్నాటి చెన్నయ్య,కందుకూరు
రైతులకు మేలు చేసింది వైఎస్సే..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇచ్చినమాట ప్రకారం రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఆయన పాలనలో అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందారు. ఆరోగ్యశ్రీ, 108 పథకాలు, రుణ మాఫీని ఎవరూ మర్చిపోలేరు. ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని నమ్మకం ఉంది.
- గట్టమనేని బసవయ్య, పలుకూరు (కందుకూరు)
మంచినీటి సమస్య తీర్చండి బాబూ..
మంచినీటి సమస్యతో మార్కాపురం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో మంచినీటి సౌకర్యం కల్పించి ఫ్లోరైడ్ బారి నుంచి విముక్తి కల్పిస్తే చాలు. మాకు సింగపూర్లు, మలేషియాలు అవసరం లేదు.
- ఎస్ఏ రజాక్, మార్కాపురం
జగన్‌తోనే ఆరోగ్యశ్రీ అమలు సాధ్యం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారు. వైఎస్ తనయుడు జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తేనే ఆరోగ్యశ్రీ పథకం అమలు సాధ్యమవుతుంది.
- దేవండ్ల సుబ్బమ్మ, మార్కాపురం
డ్వాక్రా రుణాల రద్దు మహిళలకు వరం
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని హామీ ఇవ్వడం మహిళలకు వరం లాంటిది. ప్రభుత్వం ఇచ్చిన రుణాలు సరిపోకపోవటంతో అప్పులు తెచ్చి వ్యాపారం చేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామనడం హర్షనీయం. ఇచ్చిన మాటపై నిలబడే మనిషి జగన్. అందుకే డ్వాక్రా మహిళలందరం ఆయనకే మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం.
- చాగంటి వెంకట సుబ్బమ్మ, సర్పంచ్, వేములకోట