సలహాలు, సూచనలు ఇస్తే సవరించుకుంటాం'
గుంటూరు: పుష్కర ఘాట్ ఏర్పాట్లలో ఎక్కడైనా తప్పులు జరిగితే.. మీడియా సలహాలు, సూచనలు ఇస్తే సవరించుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం సీతానగరం పుష్కర ఘాట్లను వారు పరిశీలించారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 12 రోజుల పాటు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా పుష్కర ఘాట్ల వరకు అన్ని జిల్లాల నుంచి వచ్చే బస్సులను అనుమతిస్తున్నామని చెప్పారు. బస్సులకు ఎలాంటి అసౌకర్యం కలగదన్నారు. ఒకే రోజు 50 లక్షల మంది వచ్చిన సరిపడే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 14, 15 సెలవు దినాలు కావడంతో రెట్టింపు మంది భక్తులు పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.