ఆ నేడు 6 అక్టోబర్, 1927
సినిమా... మాట్లాడింది!
కథ, కథనంతో మాత్రమే కాదు...అప్పటి వరకు పరిచయం లేని సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన వార్నర్ బ్రదర్స్ వారి ‘ది జాజ్ సింగర్’ న్యూయార్క్లో విడుదలైన రోజు ఇది. సౌండ్-ఆన్-డిస్క్ టెక్నాలజీ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ‘ఫస్ట్ ఫీచర్-లెంగ్త్ టాకింగ్ పిక్చర్’గా చరిత్రకెక్కింది. అల్ జోల్సన్, వార్నర్ ఒలాండ్, బాబీ గోర్డాన్... మొదలైన వారు నటించిన ‘ది జాజ్ సింగర్’కు ఎలెన్ క్రాస్ల్యాండ్ దర్శకత్వం వహించారు.
‘ది జాజ్ సింగర్’ ఘన విజయం ‘సెలైంట్ మోషన్ పిక్చర్’ శకానికి తెర పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఒక నాటకం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను బ్రిటిష్ సినీ చరిత్రకారుడు రేచల్ లొ ‘టర్నింగ్ పాయింట్’గా అభివర్ణించారు. ‘అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’ ‘ది బెస్ట్ అమెరికన్ ఫిల్మ్స్ ఆఫ్ ఆల్టైమ్’లో అగ్రభాగాన నిలిచింది ‘ది జాజ్ సింగర్’.