పచ్చచొక్కాలకే పందేరమా?
లబ్ధిదారుల ఎంపికలో ‘సామాజిక కార్యకర్తల’ పాత్రపై వైఎస్సార్సీపీ ధ్వజం
హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ‘సామాజిక కా ర్యకర్తల’ పాత్రపై ఏపీ శాసనసభలో దుమారం చెలరేగింది. ఈ పేరిట పచ్చచొక్కాల వాళ్లను దొడ్డిదోవన ప్రవేశపెడుతున్నారని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిం చగా ప్రభుత్వం తమదని అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. ఈ తీరును నిరసిస్తూ ప్రతిపక్షం సభ నుంచి వాకౌట్ చేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆర్కే రోజా, గౌరు చరితారెడ్డి, రాజన్న దొర, భూమా నాగిరెడ్డి, వెంకట సుజయకృష్ణ రంగారావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నపై మంగళవారం సభలో చర్చ జరిగింది. మంత్రి యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పిన తీరును శ్రీధర్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. అధికారం శాశ్వతం కాదని, వ్యవస్థల్ని బతికించేలా ప్రభుత్వ తీరు ఉం డాలని హితవు పలికారు.
తాము చెప్పింది తప్పయితే రాజీనామా చేస్తానని రాజన్నదొర సవాల్ విసిరారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పాలకుల్లో ‘తమ’ తప్ప ‘మన’ అనే భావనే లేకపోవడం విచారకరమన్నారు. యనమల మాట్లాడుతూ ఈ కమిటీలకు సర్పంచ్ కన్వీనర్‌గా ఉంటారని, తామే కమిటీలను వేశామని, ప్రభుత్వానికి సర్వహక్కులు ఉన్నాయని, తమ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నామని చెప్పడంతో విపక్షం నిరసన వ్యక్తం చేసింది. నెహ్రూ మంత్రి వ్యాఖ్యలను ఆక్షేపిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి తమ పార్టీ సభ్యులతో బయటకు వెళ్లిపోయారు.