బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు
బాలికల రక్షణ ప్రస్తుతం ప్రహసనంగా మారింది. విద్యార్థినులు స్కూలుకి వెళ్ళి సురక్షితంగా ఇంటికి వచ్చే వరకూ తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ ఏడు విద్యార్థినులపై జరిగిన లైంగిక దాడులను దృష్టిలో పెట్టుకున్న సీబీఎస్సీ.. దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని పాఠశాలలకు కొత్త సూచనలు జారీ చేసింది. పాఠశాలలో ఒకటినుంచీ పదో తరగతి వరకూ చదివే విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరిగి స్వీయ రక్షణ కల్పించుకునే అవకాశం ఉంటుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యోచించింది.
గతంలో బెంగళూరు, ఢిల్లీల్లో బాలికలపై జరిగిన లైంగిక దాడుల నేపథ్యంలో తల్లిదండ్రులు వారి వారి పిల్లలను కనీసం పాఠశాలకు పంపించేందుకు కూడ భయపడే సందర్భాలు రావడంతో బాలికల రక్షణ దృష్ట్యా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థినులకు స్కూల్లో వారంపాటు ఆత్మ విశ్వాసాన్ని పెంచే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించింది. ఈ తరగతులపై వారి వారి తల్లిదండ్రుల్లో కూడ అవగాహన కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని సీబీఎస్సీ అభిప్రాయపడుతోంది.