Self Service
-
యాపిల్ బంపర్ ఆఫర్..! ఇకపై మీఫోన్‌లను మీరే బాగు చేసుకోవచ్చు..!
ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ శుభవార్త చెప్పింది. ఇకపై ఐఫోన్ వినియోగదారులు వారి ఫోన్లను వారే రిపేర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందుకోసం యాపిల్ సంస్థ సెల్ఫ్ సర్వీస్ స్కీమ్‌ను ప్రారంభించనుంది. యూఎస్, యూకే దేశాల్లో వినియోగదారులు వాషింగ్ మెషిన్,టీవీ, ఫ్రిడ్జ్‌లు, ఫోన్లు ఇలా.. ఏదైనా ఎలక్ట్రిక్ ప్రొడక్ట్‌లు చెడిపోతే సొంతంగా రిపేర్ చేసే అధికారం లేదు. ప్రొడక్ట్ చెడిపోయిందంటే సర్వీస్ సెంటర్‌కు తీసుకొని వెళ్లాల్సిందే. దీంతో వినియోగదారులు పెద్దఎత్తున రైట్-టూ రిపేర్ ఉద్యమం చేశారు. ఈ ఉద్యమంతో దిగొచ్చిన యూకే ఈ ఏడాది జులై నెలలో ఎలక్ట్రిక్ ప్రొడక్ట్‌లు వినియోగదారులు రిపేర్ చేసుకోవచ్చంటూ కొత్త చట్టాన్ని అమలు చేసింది. వారం రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అదే చట్టాన్ని దేశంలో అమలు చేసేలా ప్రణాళికల్ని సిద్ధం చేయాలని ఫెడరల్ ట్రేడ్ కమిషన్(ftc)కి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్'ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2022లో ప్రారంభం కానున్న ఈ స్కీమ్‌లో భాగంగా యాపిల్ వినియోగదారులు,5వేల మంది యాపిల్ ఆథరైర్డ్ సర్వీస్ ప్రొవైడర్లు, 2,800మంది వినియోగదారులు ఈ స్కీమ్‌లో పాల్గొనవచ్చని యాపిల్ వెల్లడించింది. 'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్'తో లాభాలేంటి? యాపిల్ ప్రారంభించనున్న ఈ 'సెల్ఫ్ సర్వీస్ స్కీమ్' వల్ల యాపిల్ ప్రొడక్ట్‌లను రిపేర్ చేయొచ్చు. సొంతంగా ఉపాధిని పొందవచ్చు. యాపిల్ సంస్థకు కొన్ని దేశాల్లో సొంత సర్వీస్ సెంటర్లు లేవు. థర్డ్ పార్టీ సంస్థల నుంచి యాపిల్ ప్రొడక్ట్ అమ్మకాలు, సర్వీసులు జరుగుతాయి. ఈ థర్డ్ పార్టీ సర్వీస్ సెంటలలో ప్రొడక్ట్ రిపేర్ చేయించాలంటే తడిసి మోపెడవుతుంది. అయితే యాపిల్ ప్రొగ్రాంతో సర్వీస్ ఖర్చు తగ్గిపోతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నమ్మకమే జీవితం..
ద వాల్ట్.. అమెరికాలోని వ్యాలీసిటీ అనే చిన్న పట్టణంలో ఉన్న ఓ కాఫీ షాప్.. అన్ని షాపుల్లాగే.. ఇక్కడ మనకు కాఫీ, టీ, బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి. కానీ దాన్ని మీకు అందివ్వడానికి మాత్రం ఎవరూ ఉండరు.. సెల్ఫ్ సర్వీసే.. అంతేకాదు.. కనీసం మీ బిల్లు ఎంతయింది అన్నది చెప్పడానికీ ఎవరూ ఉండరు. అదే సమయంలో మనం తిన్నదానికి డబ్బులు తీసుకోవడానికి కూడా.. అంటే.. ఎవరూ మిమ్మల్ని డబ్బులు అడగరన్నమాట. మరెలా నడుస్తుంది ఈ కాఫీ షాప్.. నమ్మకం మీద.. నిజాయితీ మీద.. ఈ కాలంలోనూ వీటిని నమ్ముకుని బిజినెస్ చేస్తారా అని అనుకోవద్దు. డేవిడ్ వీటిని నమ్ముకునే ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. తన కాఫీ షాపులోకి వచ్చే వారి నిజాయితీ మీద తనకు పరిపూర్ణ నమ్మకముందని.. అందుకే వేరే సిబ్బంది ఎవరినీ నియమించలేదని డే విడ్ చెప్పారు. ఇంతకీ ‘ద వాల్ట్’ ఎలా పనిచేస్తుందంటే.. మనం కాఫీ షాపులోకి వెళ్లాం.. కాఫీ లేదా టీ తాగాలనుకున్నాం.. కొన్ని బిస్కెట్స్, ప్రేస్ట్రీ తినాలనుకున్నాం. లోపలికి వెళ్లగానే.. అక్కడ కాఫీ, టీ తయారుచేసే యంత్రాలు ఉంటాయి. దాన్నుంచి.. మనకు కావాల్సినది మనం తయారుచేసేసుకోవడమే.. తర్వాత అక్కడే రెడీగా ఉండే బిస్కెట్స్, ప్రేస్ట్రీ తీసుకుని.. లాగించేయడమే.. తర్వాత మనం తిన్నదానికి బిల్లు ఎంత అయివుంటుందో లెక్కేసుకుని.. మనం మటుకు మనమే డబ్బులు కట్టేయాలి. చెక్కులకు వేరేగా.. నగదుకు వేరేగా బాక్సుల్లాంటివి ఉంటాయి. వాటిలో వేసేయడమే.. క్రెడిట్ కార్డు అయితే.. మెషీన్ వద్ద మనమే గీకాల్సి ఉంటుంది. ఈ కాలంలో అడిగితేనే సరిగా ఇవ్వడం లేదు.. అడక్కుండా ఎవరంత నిజాయితీగా డబ్బులు తమకు తామే కట్టేస్తారు అని అనుకోవచ్చు. అయితే.. అందరి అంచనాలు తప్పయ్యాయి. తన కస్టమర్ల నిజాయితీ మీద డేవిడ్‌కు ఉన్న నమ్మకం వమ్ము కాలేదు. కొన్ని రోజుల తర్వాత తాము ఉంచిన సామాన్లకు అయిన ఖర్చు.. వచ్చిన డబ్బు లెక్కేస్తే.. లాభం పోగా.. మరో 15 శాతం ఎక్కువే వచ్చిందట. నిజాయితీ, నమ్మకం అనే పునాదులపై గతేడాది అక్టోబర్‌లో మొదలైన ఈ కాఫీ షాప్ బ్రహ్మాండంగా నడుస్తోంది.