నమ్మకమే జీవితం..
ద వాల్ట్.. అమెరికాలోని వ్యాలీసిటీ అనే చిన్న పట్టణంలో ఉన్న ఓ కాఫీ షాప్.. అన్ని షాపుల్లాగే.. ఇక్కడ మనకు కాఫీ, టీ, బేకరీ ఐటమ్స్ దొరుకుతాయి. కానీ దాన్ని మీకు అందివ్వడానికి మాత్రం ఎవరూ ఉండరు.. సెల్ఫ్ సర్వీసే.. అంతేకాదు.. కనీసం మీ బిల్లు ఎంతయింది అన్నది చెప్పడానికీ ఎవరూ ఉండరు. అదే సమయంలో మనం తిన్నదానికి డబ్బులు తీసుకోవడానికి కూడా.. అంటే.. ఎవరూ మిమ్మల్ని డబ్బులు అడగరన్నమాట. మరెలా నడుస్తుంది ఈ కాఫీ షాప్.. నమ్మకం మీద.. నిజాయితీ మీద.. ఈ కాలంలోనూ వీటిని నమ్ముకుని బిజినెస్ చేస్తారా అని అనుకోవద్దు. డేవిడ్ వీటిని నమ్ముకునే ఈ వ్యాపారం మొదలుపెట్టాడు. తన కాఫీ షాపులోకి వచ్చే వారి నిజాయితీ మీద తనకు పరిపూర్ణ నమ్మకముందని.. అందుకే వేరే సిబ్బంది ఎవరినీ నియమించలేదని డే విడ్ చెప్పారు. ఇంతకీ ‘ద వాల్ట్’ ఎలా పనిచేస్తుందంటే.. మనం కాఫీ షాపులోకి వెళ్లాం.. కాఫీ లేదా టీ తాగాలనుకున్నాం.. కొన్ని బిస్కెట్స్, ప్రేస్ట్రీ తినాలనుకున్నాం. లోపలికి వెళ్లగానే.. అక్కడ కాఫీ, టీ తయారుచేసే యంత్రాలు ఉంటాయి. దాన్నుంచి.. మనకు కావాల్సినది మనం తయారుచేసేసుకోవడమే.. తర్వాత అక్కడే రెడీగా ఉండే బిస్కెట్స్, ప్రేస్ట్రీ తీసుకుని.. లాగించేయడమే.. తర్వాత మనం తిన్నదానికి బిల్లు ఎంత అయివుంటుందో లెక్కేసుకుని..
మనం మటుకు మనమే డబ్బులు కట్టేయాలి. చెక్కులకు వేరేగా.. నగదుకు వేరేగా బాక్సుల్లాంటివి ఉంటాయి. వాటిలో వేసేయడమే.. క్రెడిట్ కార్డు అయితే.. మెషీన్ వద్ద మనమే గీకాల్సి ఉంటుంది. ఈ కాలంలో అడిగితేనే సరిగా ఇవ్వడం లేదు.. అడక్కుండా ఎవరంత నిజాయితీగా డబ్బులు తమకు తామే కట్టేస్తారు అని అనుకోవచ్చు. అయితే.. అందరి అంచనాలు తప్పయ్యాయి. తన కస్టమర్ల నిజాయితీ మీద డేవిడ్‌కు ఉన్న నమ్మకం వమ్ము కాలేదు. కొన్ని రోజుల తర్వాత తాము ఉంచిన సామాన్లకు అయిన ఖర్చు.. వచ్చిన డబ్బు లెక్కేస్తే.. లాభం పోగా.. మరో 15 శాతం ఎక్కువే వచ్చిందట. నిజాయితీ, నమ్మకం అనే పునాదులపై గతేడాది అక్టోబర్‌లో మొదలైన ఈ కాఫీ షాప్ బ్రహ్మాండంగా నడుస్తోంది.