సెల్ఫీల కోసం.. ఓ మ్యూజియం!!
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ఇపుడు సెల్పీల రాజధానిగా కూడా ఖ్యాతి గడిస్తోంది. ఇక్కడున్న ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫీల మ్యూజియం ఫోటో ప్రేమికులను, పర్యాటకులను ఆకర్షిస్తోంది. త్రీ డైమన్షనల్ పెయింటింగ్స్, శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. రండి...ఇక్కడ కావాల్సినన్ని సెల్ఫీలు తీసుకో్ండి... మీ ఆనందాన్ని ప్రపంచంతో పంచుకోండి...పండగ చేసుకోండి...అంటూ ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు.
సాధారణంగా మ్యూజియం అంటే అక్కడ ప్రదర్శనకు ఉంచిన వస్తువులను, పెయింటింగ్స్, బొమ్మలు ఏవైనా చేతితో తాకడానికి కూడా అవకాశం ఉండదు. వేలమంది సందర్శకులు వాటిని చేతితో తాకితే పాడైపోతాయనే ఉద్దేశంతో అలాంటి నిషేధాజ్ఞలు ఉంటాయి. అంతేకాదు ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతి ఉండదు. కానీ మనీలాలో ఉన్న మ్యూజియంలో మాత్రం కావాల్సినన్నీ ఫోటోలు తీసుకోవచ్చు. ముట్టుకోవచ్చు. ఆడుకోవచ్చు, గెంతొచ్చు.. అంతెందుకు మీకు ఎలా కావాలంటే అలా పోటోలకు ఫోజులివ్వొచ్చు. సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. పైపెచ్చు మాకు అదే కావాలంటున్నారు నిర్వాహకులు.
మీరు లేకపోతే ఈ మ్యూజియం లేదు.. మీరు ఫోటోలు తీసుకోకపోతే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ కు అర్థం లేదంటున్నారు మ్యూజియం కార్పొరేట్ సెక్రటరీ బ్లిత్ కాంబయా. ఇక్కడ మీ అనుభవాలను, మీరు తీసుకున్న ఫోటోలను ప్రపంచంలో ఉన్న ఎవ్వరితోనైనా పంచుకోవచ్చంటున్నారు. మిగతా మ్యూజియంలలో అయితే సీరియస్గా ఉండాలి... కానీ ఇక్కడ మాత్రం సెల్ఫీలతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు అమెరికా పర్యాటకులు. ఈ అనుభవం కొత్తగా, అద్భుతంగా ఉందంటున్నారు.