తల్లే కూతుర్ని అమ్మకానికి పెట్టింది
థానె: మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ కన్నకూతుర్ని అమ్మేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయింది. ముంబై పరిసర ప్రాంతం గోవండికి చెందిన నిందితురాలు (32) థానెకు వెళ్లి తన 16 ఏళ్ల కూతురును అమ్మకానికి పెట్టింది. ఆ అమ్మాయిని ఓ వ్యభిచారముఠాకు 5 లక్షల రూపాయలకు బేరం పెట్టింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో నిందితురాలిని అరెస్ట్ చేశారు. నిందితురాలు తన సోదరి కూతురి పెళ్లికి డబ్బులు సమకూర్చడం కోసం ఈపనికి పాల్పడినట్టు థానె పోలీసులు చెప్పారు.
థానెలోని ఓ హోటల్లో నిందితురాలు బేరం మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె 4.25 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుందని, అడ్వాన్స్‌గా 50 వేల రూపాయలు తీసుకుందని పోలీసులు చెప్పారు. నిందితురాలు సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆమెకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు కూతుర్లు ఉన్నట్టు సమాచారం.