3 లక్షల కార్ల విక్రయ లక్ష్యం: హోండా
- రూ. 380 కోట్లతో రాజస్థాన్ యూనిట్ విస్తరణ
- వచ్చే ఏడాది మార్కెట్లోకి హోండా న్యూ అకార్డ్
- హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియాలో వచ్చే ఏడాది మూడు లక్షల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రకటించింది. కొత్తమోడల్స్ ప్రవేశంతో 2016-17లో మూడు లక్షల కార్ల మార్కును అధిగమించగలమన్న ధీమాను హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిండెంట్ (మార్కెటింగ్) జ్ఞానేశ్వర్ సేన్ ధీమాను వ్యక్తం చేశారు. గతేడాది 1.89 లక్షల కార్లను విక్రయించామని, కొత్త జాజ్ రాకతో ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేయడం ద్వారా రెండు లక్షల మార్కును అధిగమించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ప్రీమియం సెగ్మెంట్లో న్యూ అకార్డ్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ మార్కెట్లో హోండా న్యూ జాజ్ కార్‌ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా సేన్ మాట్లాడుతూ దేశీయ మార్కెట్ విస్తరణపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని తయారీ యూనిట్‌ను రూ. 380 కోట్లతో విస్తరిస్తున్నట్లు తెలిపారు. దీంతో అదనంగా 60,000 కార్ల తయారీ సామర్థ్యం అందుబాటులోకి రావడంతో మొత్తం వార్షిక సామర్థ్యం 3 లక్షల యూనిట్లకు చేరుతుందన్నారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం గుజరాత్లో స్థలాన్ని సమీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే డీలర్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరిస్తున్నామని, వచ్చే మార్చిలోగా డీలర్ల సంఖ్యను 247 నుంచి 300కి పెంచడమే కాకుండా, పట్టణాల సంఖ్యను 157 నుంచి 200కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
దేశీయ కార్ల మార్కెట్లో హోండా మార్కెట్ వాటా 7 శాతంగా ఉందని, ఈ నెట్వర్క్ విస్తరణతో ఇది మరింత పెరుగుతుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కొత్తగా విడుదల చేసిన న్యూ జాజ్ 12 వేరియంట్లలో ఏడు రంగుల్లో లభిస్తోందన్నారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూం ధరను రూ. 5.40-7.98 లక్షలు (పెట్రోల్), రూ. 6.62 లక్షల నుంచి రూ. 8.75 లక్షలు (డీజిల్)గా నిర్ణయించినట్లు తెలిపారు.