జోరుగా క్యాట్‌ఫిష్ విక్రయాలు!
వావిళ్ల (విడవలూరు): వావిళ్ల కేంద్రంగా క్యాట్‌ఫిష్ (అనారోగ్యకరమైన చేపలు) విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రోజుకు 20 నుంచి 80 కిలోల లోపు ఈ చేపలను నెల్లూరులోని వివిధ హోటళ్లకు విక్రయిస్తున్నారు. ఇందంతా గ్రామానికి చెందిన వెంకటరమణయ్య అనే వ్యక్తి బహిరంగంగానే ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు.
గిరిజనులను మభ్యపెట్టి
చేపలు విక్రయించే వ్యక్తి గ్రామంలో ఉన్న గిరిజనులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారితో సమీప గ్రామాల్లో ఉన్న గుంటలు, పారుదల కాలువల్లో చేపల వేట సాగిస్తాడు. అక్కడ దోరికిన చేపలను గిరిజనుల వద్ద నుంచి కిలో రూ.20లకు కోనుగోలు చేస్తాడు. ఇలా రోజుకు 20 నుంచి 80 కిలోల వరకు ఆ గిరిజనులు తీసుకువచ్చి విక్రయదారుడుకి అమ్ముతున్నాడు. మూడు రోజులు చేపలు నిల్వ చేసి 100 కిలోలు వచ్చిన తరువాత నెల్లూరులోని ప్రముఖ హోటళ్లకు విక్రయిస్తున్నారని, ఇలా నిల్వ చేయడం వల్ల విక్రయదాడుడి ఇంటి వద్ద దుర్వాసన వస్తోందని స్థానికులు అంటున్నారు.
డిమాండ్‌ను అనుసరించి ధర
మార్కెట్లో డిమాండ్‌ను బట్టి విక్రయాలు జరుపుతున్నాడు. కిలో ధర రూ:40 నుంచి రూ.60 లకు నెల్లూరు మార్కెట్లో విక్రయించగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు మాత్రం కిలో రూ:200లకు అమ్ముతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికైన సంబంధితశాఖ అధికారులు విక్రయదారుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.