Selva
-
World U-20 Athletics Championships: భారత్‌కు మరో పతకం
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. పురుషుల ట్రిపుల్‌జంప్‌లో సెల్వ తిరుమారన్ రజత పతకం గెల్చుకున్నాడు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల సెల్వ 16.15 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 4X400 మీటర్ల రిలేలో సుమ్మీ, ప్రియా హబ్బతనహల్లి మోహన్, కుంజ రజిత, రూపల్ చౌదరీలతో కూడిన భారత బృందం ఫైనల్ చేరింది. ఇప్పటి వరకు భారత్‌కు ఈ టోర్నీలో 4గX400 మిక్స్డ్ రిలేలో రజతం, మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్యం లభించాయి. -
40 ఏళ్లుగా తలైవా అభిమానిని
సాక్షి, తమిళ సినిమా: సూపర్‌స్టార్ రజనికాంత్ అంటే అభిమానం ఉండనిదెవరికీ. చాలా మంది సినిమా హీరోలు కూడా రజనీకాంత్ అభిమానులుగా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సెల్వ. ప్రముఖ నటుడు రాజశేఖర్ సోదరుడైన ఈయన పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. ఆ మధ్య దర్శకుడిగా మారి తనే హీరోగా గోల్మాల్ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. అలాంటి సెల్వ తాజాగా కబాలి సెల్వగా పేరు మార్చుకుని నటుడు రజనీకాంత్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. రజనీ పుట్టిన తేదీ అయిన 12–12–1950 పేరునే చిత్ర టైటిల్‌గా పెట్టి తనే ఆయన అభిమానిగా హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు.ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా కబాలి సెల్వ మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా తాను రజనీకాంత్ వీరాభిమానినని తెలిపారు. అలాంటి అభిమాని పాత్రనే ప్రధాన ఇతి వృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం 12–12–1950 అని చెప్పారు. తాను రజనీ అభిమానినైనా ఆయనతో కలిసి ఒక్క చిత్రంలో కూడా నటించలేదన్నారు. నిజానికి భాషా చిత్రంలో రజనీకాంత్ తమ్ముడిగా నటించే అవకాశం తొలుత తనకే వచ్చిందని, ఆ తరువాత అది వేరే నటుడికి వెళ్లిందని తెలిపారు. అయితే భవిష్యత్తులో ఆయనతో నటించే అవకాశం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ చిత్రాన్ని విడుదలకు ముందు రజనీకాంత్‌కు చూపించి ఆయన ఆశీస్సులు తీసుకుంటానని కబాలి సెల్వ చెప్పారు. 75 శాతం కామెడీ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం రజనీకాంత్ అభిమానులందరికీ నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో తంబిరామయ్య, ఎంఎస్.భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. -
జల్లికట్టు నేపథ్యంగా వీరతిరువిళా
తమిళసినిమా: తమిళుల వీరత్వానికి చిహ్నం జల్లికట్టు క్రీడ. ఈ నేపథ్యంలో తెరకెక్కిన తొలి చిత్రం వీర తిరువిళా అని అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు విజయ్ మురళీధరన్. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఇరైవన్ సినీక్రియేషన్స్ పతాకంపై సి.సెల్వకుమార్ నిర్మిస్తున్నారు. ఈయన నిర్మించిన ఒరు కణవుపోల చిత్రం త్వరలో విడుదల కానుంది. వీర తిరువిళా చిత్రంలో సత్య,సెల్వం, సెల్వ కథానాయకులుగా నటించగా నాయకిగా తేనిక నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో పొన్వన్నన్, సింధియా, నజీర్, కాదల్సుకుమార్ నటించారు. ఈఎస్.రామ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ, ఇది జల్లికట్టు ప్రజలు నివశించే ప్రాంతం నేపథ్యంగా తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. పూర్వం జల్లికట్టు అనేది క్రీడ కాదన్నారు. అది వీర పోరాటం అని తెలిపారు. ఐదుగురు యువకులు జల్లికట్టు పోరాటంలో గెలిచి వారి ఊరికి మంచి పేరు తెచ్చిపెట్టిన కథే వీర తిరువిళా అని చెప్పారు. ఇది జల్లికట్టు క్రీడ నేపథ్యంలో తెరకెక్కించిన తొలి చిత్రం అని, ఆ తరువాత జల్లికట్టు క్రీడను నిషేధించడంతో ఈ చిత్ర విడుదలకు జాప్యం జరిగిందని తెలిపారు. చిత్ర షూటింగ్‌ను కారైక్కుడి, అమరావతి, పుదూర్, సీరావయల్, ఆకావయల్, నేమం, మేట్టూర్ పెరియతండా ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు. -
12–12–1950... అభిమానుల కథ!
12–12–1950... ఇప్పుడీ టైటిల్‌తో తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ టైటిల్ స్పెషాలిటీ ఏంటంటే... సూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టిన తేదీ అది! కథతోనూ రజనీకి లింకుంది. అదేంటంటే... ఐదుగురు రజనీ అభిమానులు ప్రతి రోజునూ తమ అభిమాన హీరో పుట్టిన రోజు కింద ఎలా సెలబ్రేట్ చేశారనేది ఈ చిత్రకథ. తమిళ నటుడు సెల్వ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఐదుగురు అభిమానుల్లో ఒకరు ‘కబాలి’ సెల్వగా నటిస్తున్నారు. సినిమాలో ఆయన లుక్ ‘కబాలి’లో రజనీకాంత్ స్టైల్లో ఉంటుందన్న మాట. ఇటీవల రజనీకాంత్‌ను కలసి, సెల్వ కథ వినిపించగా సూపర్‌స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘12–12–1950’ను ఏ జానర్లో తీస్తున్నారు? అని సెల్వను ప్రశ్నిస్తే... ‘‘సిన్మాలో 72 పర్సెంట్ కామెడీ, 28 పర్సెంట్ జీఎస్టీ ఉంటుంది’’ అన్నారు. ‘జి.ఎస్.టి.’ అంటే ‘గ్యాంగ్‌స్టర్ సెంటిమెంట్ అండ్ థ్రిల్లర్’ అట! ఇందులో ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య తొమ్మిది డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారని తెలిపారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చిందట.