సాక్షి, తమిళ సినిమా: సూపర్‌స్టార్ రజనికాంత్ అంటే అభిమానం ఉండనిదెవరికీ. చాలా మంది సినిమా హీరోలు కూడా రజనీకాంత్ అభిమానులుగా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సెల్వ. ప్రముఖ నటుడు రాజశేఖర్ సోదరుడైన ఈయన పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. ఆ మధ్య దర్శకుడిగా మారి తనే హీరోగా గోల్‌మాల్ అనే చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. అలాంటి సెల్వ తాజాగా కబాలి సెల్వగా పేరు మార్చుకుని నటుడు రజనీకాంత్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు. రజనీ పుట్టిన తేదీ అయిన 12–12–1950 పేరునే చిత్ర టైటిల్‌గా పెట్టి తనే ఆయన అభిమానిగా హీరోగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు.ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.
ఈ సందర్భంగా కబాలి సెల్వ మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా తాను రజనీకాంత్ వీరాభిమానినని తెలిపారు. అలాంటి అభిమాని పాత్రనే ప్రధాన ఇతి వృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం 12–12–1950 అని చెప్పారు. తాను రజనీ అభిమానినైనా ఆయనతో కలిసి ఒక్క చిత్రంలో కూడా నటించలేదన్నారు. నిజానికి భాషా చిత్రంలో రజనీకాంత్ తమ్ముడిగా నటించే అవకాశం తొలుత తనకే వచ్చిందని, ఆ తరువాత అది వేరే నటుడికి వెళ్లిందని తెలిపారు. అయితే భవిష్యత్తులో ఆయనతో నటించే అవకాశం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఈ చిత్రాన్ని విడుదలకు ముందు రజనీకాంత్‌కు చూపించి ఆయన ఆశీస్సులు తీసుకుంటానని కబాలి సెల్వ చెప్పారు. 75 శాతం కామెడీ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం రజనీకాంత్ అభిమానులందరికీ నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో తంబిరామయ్య, ఎంఎస్.భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment