అక్కడ టీవీలున్నాయి, కరెంట్ లేదు!
కోయంబత్తూరు: ఆ ఊళ్లలో టీవీలు, ఫ్యాన్లు, గ్రైండర్లు ఉన్నాయి కరెంట్ తప్ప. ఇదేలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? మన రాజకీయ పార్టీల ఊకదంపుడు వాగ్దానాలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకపోకపోవడంతో ఇలాంటి సిత్రాలు సాధ్యమవుతున్నాయి. కరెంట్ లేకపోయినా విద్యుత్ లో పనిచేసే వస్తువులు అక్కడకు ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే తమిళనాడులోని సెంబుక్కరై, తూమనూర్ గ్రామాలకు వెళ్లాల్సిందే.
కోయంబత్తూరు జిల్లాలోని కొండ ప్రాంతంలో ఉన్నఈ రెండు గిరిజన గ్రామాలకు స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి విద్యుత్ సౌకర్యం లేదు. కాదుకాదు మన పాలకులు కల్పించలేదు. కవుందంపలయమ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఈ గ్రామాలకు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రాజకీయ నాయకులు వచ్చారు, హామీలు ఇచ్చి వెళ్లారు. కానీ ఇప్పటివరకు కరెంట్ మాత్రం రాలేదు. అయితే గత 10 ఏళ్లలో డీఎంకే, అన్నాడీఎంకే ఉచిత కానుకలు ఇచ్చాయి. కరుణానిధి కలర్ టీవీ ఇస్తే, 'అమ్మ' గ్రైండర్లు కరుణించింది.
కరెంట్ లేకుండా ఇవేం చేసుకోమని గ్రామస్తులు వాపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. నాయకులను ఎన్నిసార్లు వేడుకున్నా కరెంట్ మాత్రం రాలేదని అమాయక పల్లెజనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సెంబుక్కరైలో 45 కుటుంబాలు, తూమనూర్ లో 110 కుటుంబాలు చీకటిలోనే మగ్గుతున్నాయి. పశ్చిమ కోయంబత్తూరుకు కూతవేటు దూరంలో ఉన్నా తమ బతుకుల్లో వెలుగులు లేవని గిరిజన ప్రజలు వాపోతున్నారు.
కిరోసిన్ దీపాలతో చీకటిని ఛేదించే ప్రయత్నం చేస్తున్నామని, కరెంట్ లేకపోవడంతో పిల్లలకు చదువులకు చాలా ఇబ్బంది కలుగుతోందని సెంబుక్కరై గ్రామానికి చెందిన కె. రంగమ్మ తెలిపింది. కరెంట్ ఇవ్వండి మహాప్రభో అని ఎన్నిసార్లు మొత్తుకున్నా పాలకులు పెడచెవిన పెట్టారని, ఇక ఆందోళనకు దిగడమే తమ ముందున్న మార్గమని ఆమె వెల్లడించింది.