సోషల్ మీడియా స్టార్ డాగ్..
ఎదురుగా దూసుకొచ్చే వాహనాలు.. అంతకు కొద్ది సెకన్ల ముందే సూర్యుడంతటి సైజులో స్పష్టంగా కనిపించే రెడ్ లైట్.. అయినా సరే ఎక్సలేటర్ డౌన్ కాదు.. దూకుడు అంతకంటే తగ్గదు. ఈ తరహా దృశ్యాలు సిటీ జంక్షన్లలో సహజమే! ఇక్కడ సమస్య ఏమంటే అలాంటి వాళ్లు ఊరికే పోరు. మనను కూడా.. అంటే సవ్యంగా రోడ్డు దాటుతున్నవాళ్లను కూడా పైకి తీసుకుపోయే బుద్ధి హీనులు వాళ్లు.
అలాంటి మాధ్యులను మేల్కోల్పడానికేనేమో.. ఇదిగో ఈ శునకరాజం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నియమపాలనతోపాటు తన- పర ప్రాణాలకు హాని కలగని విధంగా ప్రవర్తించిన ఈ కుక్కకు బుద్ధి జాస్తి అని కితాబిస్తున్నారు నెటిజన్లు.
మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 20 శాతానికిపైగా జంతువుల వల్లే చోటుచేసుకుంటున్నట్లు వివిధ సర్వేలు తేల్చాయి. నిజమేకదా.. స్పీడ్ గా బైక్ మీద వస్తున్నప్పుడు...ఏ కుక్కో, కోడో అడ్డొచ్చి బొక్కబోర్లా పడిపోయిన అనుభవం లేనోళ్లు ఉన్నారంటే నమ్మడం కష్టమే! సరే, ఇప్పుడీ సోషల్ మీడియా స్టార్ డాగ్ దగ్గరికొస్తే..
ఏ నగరంలో షూట్ చేశారో తెలియదుకానీ సెన్సిబుల్‌గా రోడ్డు దాటిన కుక్క వీడియో ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా వ్యూస్, 15 వేలకు పైగా షేర్లు సాధించింది. తన గమ్యానికి చేరుకోవడానికి అడ్డుగా ఉన్న ట్రాఫిక్ ను అమాంతం దాటేయకుండా ట్రాఫిక్ పోలీసు సిగ్నల్ ఇచ్చేదాకా ఆగి మరీ సురక్షితంగా వెళ్లిందీ శునకం. కుక్క బుద్ధికి జేజేలతోపాటు ట్రాఫిక్ కానిస్టేబుల్ కు కూడా అభినందనలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.