శ్రీలంక 261/8
తరంగ సెంచరీ మిస్ పాక్‌తో రెండో టెస్టు
కొలంబో: సీనియర్ బ్యాట్స్‌మన్ మహేల జయవర్ధనే చివరి టెస్టులో శ్రీలంక జట్టు ఎదురీదుతోంది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో పాకిస్థాన్‌తో జరుగుతున్న ఈ రెండో టెస్టులో లంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 261 పరుగులు చేసింది. ఓపెనర్ ఉపుల్ తరంగ (179 బంతుల్లో 92; 12 ఫోర్లు) కొద్దిలో సెంచరీ కోల్పోగా... మరో ఓపెనర్ సిల్వ (106 బంతుల్లో 41; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 79 పరుగులు జోడించింది. మిడిలార్డర్లో కెప్టెన్ మాథ్యూస్ (86 బంతుల్లో 39; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. జునైద్ ఖాన్‌కు నాలుగు, వహాబ్ రియాజ్‌కు మూడు వికెట్లు పడ్డాయి.
జయవర్ధనే విఫలం
ఇక సొంత మైదానంలో కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్న జయవర్ధనే కేవలం నాలుగు పరుగులు చేసి నిరాశపరిచాడు. అంతకుముందు తమ ఆరాధ్య క్రికెటర్‌కు ఘన వీడ్కోలు చెప్పేందుకు స్టేడియంలో అభిమానులు కటౌట్లు ఏర్పాటు చేశారు. తను చుదువుకున్న కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక స్టాండ్‌లో కూర్చున్నారు. 37 ఏళ్ల ఈ క్రికెటర్ క్రీజులోకి వస్తున్న సమయంలో పాక్ ఆటగాళ్లు వరుసగా నిలబడి ఆహ్వానం పలుకగా 3 వేల మంది ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో స్వాగతించారు.