అనుకున్నదానికన్నా ఎక్కువే సాధించాను!
సందర్భం : నేడు రంగనాథ్ పుట్టినరోజు
రంగనాథ్ ఎవరు? అంటే... ‘ఓ సీనియర్ క్యారెక్టర్ యాక్టర్’ అని చెబుతుందీ జనరేషన్. మూడున్నర దశాబ్దాల క్రితం ఆయనో రొమాంటిక్ హీరో అని నేటి తరానికి తెలీదు. ‘జీవితం ఓ వైకుంఠపాళి’ అంటారు. దానికి రంగనాథ్ జీవితం ఓ ఉదాహరణ. అపారమైన ప్రతిభ ఉన్నా, మనిషి అందుబాటులోనే ఉన్నా, చిత్ర సీమ అంతంత మాత్రపు అవకాశాలే ఇస్తున్న సీనియర్ నటుడు రంగనాథ్. ఆయన 68వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఆయన చెప్పిన కబుర్లు.
సినిమాలేమైనా చేస్తున్నారా?
లేదు.. చూస్తున్నాను. చూస్తుంటే... ‘ఇందులో ఏం వేషం ఉంది.. వీళ్లు నన్ను అడగడానికి’ అనిపిస్తుంది. దీన్ని బట్టి వారినీ నిందించడానికి లేదు.
అంటే ప్రస్తుతం మీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదా?
నేను మాత్రమే చేయదగ్గ పాత్ర అనుకున్నప్పుడు నా దగ్గరకొస్తున్నారు. నచ్చితే నేనూ చేస్తున్నాను. వరుణ్‌సందేశ్ సినిమా, వెంకటేశ్ - పవన్‌కల్యాణ్‌ల ‘గోపాల గోపాల’... ఇలా అయిదారు సినిమాలున్నాయి.
హీరోకు ఉండాల్సిన అర్హతలన్నీ ఉండి కూడా.. ఈ పోటీలో ముందుకెళ్లలేకపోయారేం?
చూడండీ! ఏనుగంత అర్హత కన్నా... ఆవగింజంత అదృష్టం గొప్పది. మనిషిని ప్రభావితం చేసేది అదే. మీరు ఇంటి దగ్గర నుంచి ఆఫీస్‌కు బయలు దేరారు. దారిలో ప్రతి చోటా రెడ్ సిగ్నల్స్ పడ్డాయి. దాంతో ఆగి ఆగి ప్రయాణం చేశారు. కానీ, రెండో రోజు మాత్రం ప్రతి చోటా గ్రీన్ సిగ్నల్సే పడ్డాయి. ఈ దఫా ఎక్కడా ఆగాల్సిన పనిలేకుండా పోయింది. అదే జీవితం. నేను అనుకున్నంత స్థాయికి రాలేదని ప్రపంచానికి అనిపించొచ్చు. కానీ, నేను ఎదుర్కొన్న సమస్యలు, నాకు ఎదురైన అనుభవాలను బట్టి చూస్తే... అనుకున్న దానికంటే ఎక్కువే సాధించాననేది నా భావన. ఇక్కడ సంపాదించుకున్న వారంతా గొప్పవాళ్లూ కాదు, సంపాదించలేకపోయినవారు అసమర్థులూ కాదు.
అనుకున్నదాని కంటే ఎక్కువే సాధించానంటున్నారు కదా! ఎలా?
బాధ్యతల్ని నెరవేర్చుకుంటూ వెళ్లడమే జీవితం. అలా చేసినవాడు కోట్లు సంపాదించకపోయినా ఫర్లేదు. నా దృష్టిలో మాత్రం వాడే గొప్పవాడు. నాకు ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లెలు. వారిని చదివించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాను. వాళ్ళు జీవితంలో స్థిరపడేలా చేశాను. నా తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకున్నాను. నాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. వారిని బాగా చదివించాను. పెళ్లిళ్ళు చేశాను. ఇక నా భార్యకు అనుకోకుండా జరిగిన ప్రమాదం, ఆమెను చివరిదాకా జాగ్రత్తగా చూసుకున్న వైనం అందరికీ తెలుసు. వీటిని నేను భారాలుగా భావించలేదు. బాధ్యతలుగా భావించా. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.. నేను నైతికంగానే కాదు, ఆర్థికంగా కూడా విజయం సాధించాను. ఈ రోజు నేను ఒకరి వద్ద చేయి చాచాల్సిన పరిస్థితి లేదు.
నటనపై ఆసక్తి ఎలా మొదలైంది మీకు?
మా అమ్మకు నన్ను సినిమా యాక్టర్‌ను చేయాలని కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికో ఏమో... నన్ను నాలుగో క్లాస్‌లోనే స్టేజ్ ఎక్కించేసింది. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువగా చూసేవాణ్ణి. వాటిలోని పాత్రల్ని పరిశీలిస్తే - వాళ్లు నటించడం లేదు, పాత్రోచితంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయం అర్థమైంది. అంటే... నటించే స్కూల్, ప్రవర్తించే స్కూల్ ఇలా రెండు స్కూల్స్ ఉంటాయని అప్పుడే తెలుసుకున్నాను. ప్రవర్తించే స్కూల్‌ను సాంఘిక చిత్రాలకు, నటించే స్కూల్‌ను పౌరాణిక, జానపదాలకు అనుసరించాలని నిర్ణయించుకున్నా. తర్వాత ‘చందన’(1973) కథానాయకునిగా అవకాశం రావడం, తర్వాత ఎనిమిదేళ్ల పాటు హీరోగా, 43 ఏళ్లుగా క్యారెక్టర్ నటునిగా నా కెరీర్ మీకు తెలిసిందే. మూడొందల పై చిలుకు సినిమాల్లో నటించా. అందులో 60 సినిమాల్లో హీరోగా చేశా. మీరు హీరోగా చేసిన పలు చిత్రాల్లో భార్యతో తగువు పెట్టుకోవడం, విడిపోవడం.. ఎవరో ఒకరు మిమ్మల్ని కలపడం. ఇవే కథలు. కానీ నిజజీవితంలో మీరు మంచి భర్త...
పాత్ర చేసేటప్పుడు ‘ఇది ఎలా చేయాలి?’ అని ఆలోచించాలి. నిజజీవితంలో మీరన్నట్టు నేను మంచి భర్తనే అయినా, ఆమె ఉన్నప్పుడు మా ఇద్దరికీ అప్పుడప్పుడు గొడవలవుతూనే ఉండేవి. భార్యాభర్తలన్నాక ఆ మాత్రం గొడవలు లేకపోతే కిక్కుం డదు. గొడవ తగ్గాక, మళ్లీ మాట్లాడుకుంటారు చూడండీ అది గమ్మత్తుగా ఉంటుంది.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో మీకు గౌరవం ఎలా ఉంది?
హీరోగా ఉన్నప్పుడు పరిశ్రమ నన్నెలా చూసిందో ఇప్పటికీ అదే గౌరవం. నేను హీరోగా ఉన్నప్పుడే హీరోగా ఫీలవ్వలేదు. ఒక నటునిగానే మసలుకున్నా. నాలో మార్పు లేదు. పరిశ్రమలో కూడా నా పట్ల మార్పు లేదు.
కార్తవీర్యార్జునుడు వంటి పురాణ పాత్రలూ చేశారు కదా. వాటికి ప్రేరణ?
చిన్నప్పటి నుంచీ ఎన్టీఆర్, ఎస్వీఆర్‌ల సినిమాలు చూస్తూ పెరిగాను. వారే ప్రేరణ. కానీ నటునికి పరిశీలనాత్మక దృష్టి ఎంతైనా అవసరం. పాత్రను బట్టి ప్రవర్తన ఉండాలి. ఎప్పటికైనా రావణాసురుడి పాత్ర పోషించాలని నాకు కల. ఆ పాత్ర కోసం ఎంతో ఎదురు చూశాను. కానీ రాలేదు. ఇప్పుడు వచ్చినా చేయలేని పరిస్థితి. ఎందుకంటే... దానికి తగ్గ పర్సనాలిటీ ఇప్పుడు నాకు లేదు.
అవునూ, మీ రచనా ప్రస్థానం ఎందాకా వచ్చింది?
ఇప్పటికి నాలుగు పుస్తకాలు విడుదల చేశాను. అయిదో పుస్తకం ముద్రణ దశలో ఉంది. అయితే రచన నా హాబీ మాత్రమే. వాటితో పేరు సంపాదించాలనే కోరిక నాకు లేదు. కేవలం ఆత్మసంతృప్తి కోసమే. నేను డెరైక్ట్ చేసిన ‘మొగుడ్స్-పెళ్లామ్స్’లో రెండు పాటలు కూడా రాశా.
భవిష్యత్ నిర్ణయాలేమైనా ఉన్నాయా?
నాకేం ప్లాన్స్ లేవు.. దైవనిర్ణయాన్ని బట్టి నడుచుకోవడమే.