డిసెంబర్ వరకు కొనసాగనున్న సెలక్టర్లు
ముంబై: సందీప్ పాటిల్ నేతృత్వంలోని సీనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ పదవీ కాలం మరో సారి పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఐదుగురు సభ్యులు కొనసాగవచ్చని సమాచారం. బీసీసీఐలో సంస్కరణల అమలు కోసం లోధా కమిటీ డిసెంబర్ వరకు గడువు విధించిన నేపథ్యంలో ఆలోగా కొత్త కమిటీని ఎంపిక చేయకుండా దీనిని కొనసాగించాలని బోర్డు భావిస్తోంది. లోధా సిఫారసుల ప్రకారం డిసెంబర్ 15లోగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అదే విధంగా డిసెంబర్ 30లోగా బోర్డులోని వేర్వేరు కమిటీలను కూడా ఏర్పాటు చేయాలి.
వీటిలో సెలక్షన్ కమిటీ కూడా ఒకటి. అయితే లోధా ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఐదుగురు సభ్యుల కమిటీని మూడుకు కుదించడంతో పాటు తప్పనిసరిగా టెస్టు ఆడినవారినే నియమించాలి. పాటిల్ సహా ఐదుగురు సభ్యుల కమిటీ పదవీకాలం ఈ ఏడాది ఆరంభంలోనే ముగిసినా... టి20 ప్రపంచకప్ నేపథ్యంలో వారికి ఒకసారి పొడిగింపు లభించింది.