‘కైసే హో ’.. అచ్చా హై!
♦ సీనియర్ డీపీవో శ్రీరాములుకు డీఆర్ఎం వీజీ భూమా కితాబు
♦ రైల్వే డివిజన్లో మూడు కొత్త ప్రణాళికలు ప్రారంభం
లక్ష్మీపురం (గుంటూరు) : సౌత్ సెంట్రల్ పరిధిలోని గుంటూరు రైల్వే డివిజన్లో ఎన్నడూ లేని విధంగా డివిజన్ పరిధిలో ఉన్న 4 వేల మంది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ‘కైసే హో (ఎలా ఉన్నావు)’ కార్యక్రమం ప్రారంభించడం అభినందనీయమని గుంటూరు రైల్వే డీఆర్ఎం వీజీ భూమా అన్నారు. స్థానిక పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్ఎం కార్యాలయ ప్రాంగణంలోని సీనియర్ డీపీవో కార్యాలయంలో డీఆర్ఎం వీజీ భూమా, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ ఎం. శ్రీరాములు సంయుక్తంగా మంగళవారం కైసే హో (ఎలా ఉన్నావు), మై ఫ్యామిలీ ట్రీ, ఎస్.ఎమ్.ఎస్.. కార్యక్రమాలపై డివిజన్ పరిధిలోని సంబంధిత విభాగాధిపతులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా ఈ మూడు కార్యక్రమాలను డీఆర్ఎం ప్రారంభించారు.
సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకే..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని 129 మంది సూపర్వైజర్ల కంట్రోల్లో 4 వేల మంది సిబ్బంది ఆయా విభాగాలలో వి«ధులు నిర్వర్తిస్తున్నారని, వారందరితో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కైసే హో కార్యక్రమం ఏర్పాటు మంచి ప్రయత్నమని సీనియర్ డీపీవో శ్రీరాములును అభినందించారు. ఈ కార్యక్రమం మొదటగా సౌత్ సెంట్రల్లో ప్రారంభించడం, అది కూడా గుంటూరు రైల్వే డివిజన్లో మొదలెట్టడం సంతోషదాయకంగా ఉందని తెలిపారు. తమ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగితో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం బాగుంటుందన్నారు. అలాగే ‘మై ఫ్యామిలీ ట్రీ’ అనే కార్యక్రమంలో ప్రధానంగా డివిజన్ పరిధిలోని విధులు నిర్వర్తించే 4 వేల మంది ఉద్యోగుల పేరు వివరాలతో పాటు వారి జనన ధృవీకరణ వివరాలు కూడా సేకరించడం జరిగిందని తెలిపారు. దీని ద్వారా డివిజన్ పరిధిలో ప్రతి ఉద్యోగి జన్మదినం రోజు స్వయానా డీఆర్ఎం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయనున్నట్లు చెప్పారు.
అదే రోజు ఆ ఉద్యోగి డివిజన్ పరిధిలోగాని, విధులు నిర్వర్తించే ప్రాంతంలోగానీ ఓ మొక్కను నాటే కార్యక్రమం కూడా ప్రవేశపెట్టామని వెల్లడించారు. దీని ద్వారా 4 వేల మంది నాలుగు వేల మొక్కలను నాటే అవకాశం కల్పించామని తెలిపారు. ఆ మొక్కల బాగోగులు కూడా ఆ ఉద్యోగి చూసుకోవాలని చెప్పారు. అదే విధంగా ‘ఎస్.ఎమ్.ఎస్’ కార్యక్రమంలో డివిజన్ పరిధిలో ప్రమాదవశాత్తు గాయాల పాలైన, మరణించిన, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగికి ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ 9701309607 కు మెసేజ్ చెయ్యడం ద్వారా సంబంధిత విభాగాధిపతులకు ఆ సమాచారం పంపించి తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని వివరించారు.
ప్రతి మంగళవారం..
సీనియర్ డివిజనల్ పర్సనల్ అధికారి ఎం. శ్రీరాములు మాట్లాడుతూ డీఆర్ఎం వీజీ భూమా, ఏడీఆర్ఎం రంగనాథ్ సహకారంతో ఈ సరికొత్త కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో కైసే హో కార్యక్రమం ప్రతి మంగళవారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు డివిజన్ పరిధిలో ఉన్న 4 వేల మంది ఉద్యోగుల సమస్యల గురించి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు, సీనియర్ డీఎస్టీ మునికుమార్, సీనియర్ డీఎస్వో సుబ్రహ్మణ్యం, సంబంధిత విభాగాధికారులు పాల్గొన్నారు.