ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి!
- దర్శకుడు కె. రాఘవేంద్రరావు
ఒకటీ రెండు కాదు... ఏకంగా 44 చిత్రాలు రూపొందించి, అత్యధిక చిత్రాల దర్శకురాలిగా ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’కు కూడా ఎక్కిన ఘనత నటి విజయ నిర్మలది. ఆమె సినీ జీవిత విశేషాలు, అరుదైన ఫోటోలతో సీనియర్ సినీ జర్నలిస్ట్ యు. వినాయకరావు ‘గిన్నీస్‌బుక్ విజేత’ పేరిట ఒక పుస్తకం రాశారు. విజయనిర్మల 71వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈ పుస్తకావిష్క రణ జరిగింది. సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు పుస్త కాన్ని ఆవిష్కరించగా, తొలి ప్రతిని హీరో కృష్ణ స్వీకరించారు.
మలిప్రతిని సీనియర్ సినీ జర్నలిస్టు బి.ఏ. రాజు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి ముందు అభిమానులు, సినీ శ్రేయోభిలాషుల మధ్య విజయనిర్మల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయనిర్మల కుమారుడు - నటుడు నరేశ్‌తో పాటు సీనియర్ సినీ నేపథ్య గాయని రావు బాలసరస్వతి, నటి జయసుధ, నటుడు ‘గుండు’ సుదర్శన్, దర్శకురాలు బి.జయ, నిర్మాత ‘పద్మా లయ’ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘‘విజయ నిర్మల స్ఫూర్తితో మరింత మంది మహిళా దర్శకులు పరిశ్రమకు రావాలి’’ అని రాఘవేంద్రరావు అభిప్రాయపడగా, ‘‘విజయనిర్మలపై పుస్తకం వెలువడిన ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకమైనది’’ అని కృష్ణ పేర్కొన్నారు. ‘‘ఈ పుస్తకం విజయ నిర్మల గారికి నేనిస్తున్న పుట్టినరోజు కానుక’’ అని వ్యాఖ్యానించిన వినాయకరావు త్వరలోనే హీరో కృష్ణపై ‘దేవుడు లాంటి మనిషి’ అనే పెద్ద పుస్తకాన్ని వెలువరించ నున్నట్లు ప్రకటించారు. మహేశ్‌బాబు అభిమాన సంఘాల ప్రతినిధులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దయెత్తున వచ్చి ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.