ఆఫీసులో జర్నలిస్టు న్యూస్ రాస్తుండగా..!
అహ్మదాబాద్: ఓ సీనియర్ జర్నలిస్టు ఏకంగా పత్రికా కార్యాలయంలోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. కార్యాలయంలో కూర్చుని వార్తాకథనం రాస్తుండగా దుండగులు ఆయనను కిరాతకంగా పొడిచి చంపారు. నెత్తుటి మడుగులో ఉన్న ఆయన మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. గుజరాత్ సౌరాష్ట్ర ప్రాంతంలోని జునాగఢ్ పట్టణంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
'జై హింద్' గుజరాతీ వార్తాపత్రికలో కిషోర్ దవే (53) బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్నారు. ఆయన సోమవారం రాత్రి ఒంటరిగా పత్రికా కార్యాలయంలో కథనం రాస్తుండగా ఈ దాడి జరిగింది. పోలీసులు ఇంతవరకు ఎవరినీ నిందితులుగా పేర్కొనలేదు. కానీ, దవే కుటుంబ సభ్యులు మాత్రం ఇది స్థానిక రాజకీయ నాయకుడి కొడుకు పనేనని, సదరు నాయకుడి కొడుకు మీద లైంగిక వేధింపుల ఆరోపణల గురించి దవే ఏడాది కిందట కథనం రాశారని, దీంతో అతనిపై కేసు నమోదైందని, ఆ కక్షతోనే అతను ఈ హత్య చేయించాడని బంధువులు చెప్తున్నారు.