'యూపీ ఎన్నికల వరకు కాంగ్రెస్ తోనే'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. సీనియర్ నాయకుల వ్యవహారం నచ్చక కాంగ్రెస్ కు దూరమవుతారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. యూపీ ఎన్నికల ప్రచారానికి కొత్త టీమ్ ను ఏర్పాటు చేయాలని ప్రశాంత్ కిశోర్ పట్టుబడుతున్నట్టు సమాచారం.
కమల్ నాథ్, గులాంనబీ ఆజాద్, షీలా దీక్షిత్ వంటి సీనియర్ నాయకులతో ఈ బృందం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. దీంతో పలువురు సీనియర్ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. అమరీందర్ సింగ్, షకీల్ అహ్మద్ వంటి నాయకులు బహిరంగంగానే ఆయనపై విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ గుడ్ బై చెబుతారని ప్రచారం జరిగింది. ఇవన్నీ ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ లకు ఎన్నికల ప్రచారంతో వ్యూహకర్తగా వ్యవహరించి వారికి విజయాలు సాధించిపెట్టడంలో ప్రశాంత్ కిశోర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.