సీఎంతో ఖడ్సేకు విభేదాలు..?
సాక్షి, ముంబై: రాష్ట్ర బీజేపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ 42 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే . ఈ సమయంలో విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీరుపై పార్టీ సీనియర్ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే గుస్సాగా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
అధికారుల బదిలీల నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా మనుకుమార్ శ్రీవాస్తవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బదిలీ ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఎంకు రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే లేఖను రాసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దాంతో తాను బదిలీలకు సంబంధించి సీఎంకు ఎటువంటి లేఖ రాయలేదని ఖడ్సే వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
కాగా, ఖడ్సే ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, ఆయన మా పార్టీ సీనియర్ నాయకుడని దీంతో తాము కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఆయనతో కూడా చర్చలు జరిపామని సీఎం స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, మరోవైపు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర సహకార మంత్రి రావ్‌సాహెబ్ దానవే పేరును ప్రకటించడంపై కూడా ఖడ్సే అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం.