సెన్సర్ కీబోర్డు
గాడ్జెట్ ఏదైనా మెయిల్ టైప్ చేయాలంటే కీబోర్డు తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే మౌస్ ఉండక తప్పదు. ఊహూ.. అక్కరలేదంటోంది జెస్ట్. కీబోర్డు ఉందనుకుని గాల్లో టైప్ చేసినా వాటిని కంప్యూటర్ తెరపై అక్షరాలుగా మార్చేస్తుందీ హైటెక్ గాడ్జెట్. ఫొటోలో చూపినట్లు నాలుగు వేళ్లకు తగిలించుకునే రింగ్‌లు, అరచేతిపై అమర్చుకునే పట్టీలతో కూడిన జెస్ట్‌లో యాక్సెలరోమీటర్లు, గైరోస్కోపులు, మాగ్నెటోమీటర్లు బోలెడు ఉంటాయి. ఇవన్నీ మన వేలి కదలికలను బట్టి అక్షరాలను అంచనావేసి స్క్రీన్‌పై చూపుతాయి.
స్మార్ట్ఫోన్లలో మాదిరిగా ప్రిడిక్టివ్ టెక్ట్స్టెక్నాలజీని ఉపయోగించుకుంటాయి. తదనుగుణంగా మనం టైప్ చేసుకుంటూ కావాల్సిన పదాలను సెలెక్ట్ చేసుకుంటే సరి. రెండేళ్ల క్రితం జరిగిన ఓ హ్యాకథాన్‌లో రాత్రికిరాత్రి ఈ గాడ్జెట్ ప్రొటోటైప్‌ను తయారు చేసిన మైక్ ఫ్రిస్టర్ బృందం ఆ తరువాత అపోటాక్ట్ ల్యాబ్ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేసి జెస్ట్‌ను మరింత అభివృద్ధి చేసింది. వాణిజ్యస్థాయి తయారీకి నిధులు కావాలంటూ కిక్‌స్టార్టర్‌లో ప్రచారం చేపట్టడంతో దీని గురించి ప్రపంచానికి తెలిసింది.
జెస్ట్ ఎక్స్‌బాక్స్ కైనిక్ట్ లేదా లీప్ మోషన్ మాదిరిగా పూర్తిగా వేలి కదలికలపై మాత్రమే ఆధారపడదని, మౌస్ బటన్‌ను డబుల్ క్లిక్ చేసినట్లు... లేదా కీబోర్డ్ షార్ట్కట్ల తీరులో ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు నిర్దిష్టమైన పని జరిగేట్టు కూడా పనిచేస్తుందని ఫ్రిస్టర్ అంటున్నారు. బ్లూటూత్ ఉన్న ఏ పరికరంతోనైనా జెస్ట్ పనిచేస్తుందని చెప్పారు. కిక్‌స్టార్టర్ ద్వారా అనుకున్నన్ని నిధులు సమకూరితే వచ్చే ఏడాదికల్లా జెస్ట్ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.